వామ్మో.. బెర్ముడా! | all about bermuda triangle and the accidents | Sakshi
Sakshi News home page

వామ్మో.. బెర్ముడా!

Published Fri, Jul 3 2015 4:11 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

all about bermuda triangle and the accidents

అది 1945, డిసెంబరు 5...
సమయం: మధ్యాహ్నం 2.10 గంటలు..

స్థలం: ఫ్లోరిడాలోని నావల్ ఎయిర్ స్టేషన్.. టీబీఎమ్ అవెంజర్స్ రకానికి చెందిన 5 బాంబర్ విమానాలు ‘ఫ్లైట్-19’ అనే కోడ్ నేమ్‌తో రోజువారీ శిక్షణలో భాగంగా టేకాఫ్ తీసుకున్నాయి. అవి బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. దాని కెప్టెన్ నుంచి ఓ సందేశం వచ్చింది.  '‘మేము తెల్లటి నీటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నాం.. దిక్సూచీలు పనిచేయట్లేదు. మేం ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు'' అని. తర్వాత రాడార్‌పై విమానాలు కనిపించలేదు. అందులో ప్రయాణిస్తున్న 13 మంది సిబ్బంది, ఆ విమానాలు ఏమయ్యాయో నేటికీ తెలియలేదు. అయితే, వాటి అదృశ్యానికి బెర్ముడా ట్రయాంగిల్‌కు ఉన్న సంబంధమేంటి?

బెర్ముడా ట్రయాంగిల్ వాయవ్య అట్లాంటిక్ ప్రాంతంలోని ఒక అంతుచిక్కని ప్రాంతం. దీన్నే 'డెవిల్ ట్రయాంగిల్’ అని కూడా పిలుస్తారు. వందల ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏదో జరుగుతోందన్న వాదనలు, ఆందోళనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి వచ్చిన ఓడలు, విమానాలు గల్లంతవడం, అందులోని మనుషుల జాడ కూడా తెలవకపోవడంతో ఇది మిస్టరీ ప్రాంతంగా మిగిలిపోయింది. ఇప్పటిదాకా 30 ఓడలు, 40 దాకా విమానాలు ఈ ప్రాంతంలో కూలాయి. బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలోకి రాగానే భారీ ఓడలు, విమానాలు అనూహ్యంగా అదృశ్యమవడం, కనీసం వాటి ఆనవాళ్లు కూడా లభించకపోవడం వెనక అనేక కథలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఏదో శక్తి ఉందని, గ్రహాంతర వాసులు ఇదంతా చేస్తున్నారని ప్రజలు, రచయితలు రకరకాల వాదనలు చేస్తున్నారు. వీటిపై జరిగిన పరిశోధనలు మాత్రం అలాంటివాటికి ఆధారాలేం లేవని చెబుతున్నాయి.
 
ఎక్కడుంటుంది?

ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, కరీబియన్ దీవి ఇంకా అజెరాస్ తూర్పుభాగాన ఉన్న అరేబియన్ సముద్రం వీటి మధ్య విస్తరించిన ట్రెపిజాయిడ్‌ను కలిపి బెర్ముడా ట్రయాంగిల్’గా వ్యవహరిస్తారు. ఎక్కువ ప్రమాదాలు ఫ్లోరిడా తీరం, బహామా దీవుల్లోనే జరిగినట్లు చెబుతారు. ఇది చాలా రద్దీ ప్రాంతం. తరచు అమెరికా, యూరప్, కరీబియన్‌ దేశాలకు చెందిన పలు ఓడలు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో సముద్రం అడుగున ‘సాగర అంతర్వాహిని’(గల్ఫ్‌స్ట్రీమ్ ) ప్రవహిస్తుందని, అదే ప్రమాదాలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇక్కడ హఠాత్తుగా తుపానులు చెలరేగి వెంటనే సమసిపోతుంటాయి. మెక్సికో సింధుశాఖ నుంచి ఫ్లోరిడా జలసంధి దాకా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే ఒక అంతర్వాహిని. ఒకరకంగా చెప్పాలంటే.. ఇది సముద్రంలో ప్రవహించే ఒక నది అన్నమాట. అడుగున ప్రవాహం ఉన్నపుడు ఉపరితలంలో ఉన్న ఓడలను లాక్కోవడం వింతేమీ కాదు. అవి మరో చోట తేలడంలో విచిత్రమేం లేదు. ఇక్కడ అకస్మాత్తుగా చెలరేగే అలలు కూడా పడవలు మునగడానికి, అదృశ్యమవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొలంబస్‌కూ అనుభవమే!
ఈ ప్రాంతంలో అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయని క్రిస్టఫర్ కొలంబస్ రాశాడు. ఇక్కడ క్షితిజ రేఖలో ఏవో వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచీ కొలతలు సైతం అసంబద్ధంగా, అసాధారణంగా ఉన్నాయని 1492, అక్టోబరు 2న తన లాగ్‌బుక్‌లో రాశాడు. కొలంబస్ అనుమానాలకు ఆధునిక శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చూసిన వెలుగులు అక్కడ దీవి వారు వంట చేసుకుంటే వచ్చిన వెలుగులుగా చెబుతున్నారు.
 
శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
బెర్ముడా ట్రయాంగిల్‌లో ఏం జరుగుతోందన్న విషయం తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు పర్యటించారు. వారికి అక్కడ అసాధరణంగా ఏదీ కనిపించలేదు. కానీ, కొన్ని ఆసక్తికర విషయాలు వారి దృష్టికి వచ్చాయి. ఆ ప్రాంతంలో బలమైన సుడిగుండాలు ఏర్పడతాయి. ఇవి జలాల ఉపరితలాలపై కాకుండా, అంతరపొలాల్లో  ఏర్పడటం గమనార్హం. ఇవి ఒక్కోసారి 200 కిలోమీటర్ల మేర వ్యాసార్థంలో ఉండటం గమనార్హం. భ్రమణంలో ఉన్న వస్తువుపై ఎలాంటి భూమ్యాకర్షణ శక్తి పనిచేయదు. కాబట్టి. ఈ సుడిగుండాల్లో చిక్కిన ఓడలు, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు వీటిలో చిక్కుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
 
అన్నీ అభూత కల్పనలే: క్వొశ్చె
బెర్ముడా ట్రయాంగిల్‌కు సంబంధించిన వెలువడుతున్న సంచలనాలపై ఆరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ క్వొశ్చె పరిశోధన చేశాడు. 1975లో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అనే పుస్తకం ప్రచురించాడు. అక్కడ జరిగే ప్రమాదాలు అసాధారణమైనవి కాదని స్పష్టంచేశాడు. అలాంటివి ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయని చెప్పాడు. రచయితలు, మీడియా వ్యక్తులు  అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేశారని వాదించాడు. అవన్నీ సంచలనాల కోసం చేసిన ప్రయత్నాలుగా తన పుస్తకంలో అభివర్ణించాడు. అక్కడ జరిగిన ప్రమాదాలలో కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల సంభవిస్తే..మరికొన్ని మానవ తప్పిదాల వల్ల జరిగాయని వివరించాడు. బెర్ముడా ట్రయాంగిల్‌తో సంబంధం లేని ఘటనలను కూడా దానితో ముడిపెట్టి రాశారని ఆరోపించాడు. అంతేకాకుండా వాటికి బెర్ముడా ట్రయాంగిల్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆధారాలతో పేర్కొన్నాడు.
 -సాక్షి, స్కూల్‌ఎడిషన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement