
‘నా తాగుడు మోదీకెందుకు.. సభలో ఇలాగేనా?’
తన తాగుడు విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీపై హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ అన్నారు.
న్యూఢిల్లీ: తన తాగుడు విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీపై హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ అన్నారు. తన మర్యాదకు భంగం కలిగేలా మాట్లాడిన మోదీ మాటలు వెంటనే రికార్డుల్లోనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఫిర్యాదు తప్పనిసరిగా చేస్తానని బెదిరించారు. నలుగురిలో ఉండగానే భగవంత్ మన్ ఫుల్లుగా మద్యం సేవిస్తారని, పార్లమెంటుకు, బహిరంగ కార్యక్రమాలకు అలాగే వస్తారని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పలుమార్లు ఆయన ఆధారాలతో సహా దొరికిపోయారు కూడా.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బుధవారం లోక్‌సభలో విపక్షాలు తప్పుబట్టిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ వాటిపై వివరణ ఇస్తూ అందులో భాగంగా చార్వక తత్వశాస్త్రం గురించి చెప్పారు. అలా చెబుతూ భగవంత్‌మన్‌పై తిరిగి ‘నువ్వు చాలా కాలం బతకుండాలంటే కాస్తంతా సరదాగా ఉండాలి. లోన్ తీసుకొని వీలయినంతవరకు నచ్చిన మంచి నెయ్యి, పెరుగులాంటి పదార్థాలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో అందరు పక్కున నవ్వారు. గతంలో విలువలుండేవని, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకునేవారని మోదీ అన్నారు.
దీంతో ఆగ్రహంతో సభ నుంచి బయటకొచ్చిన మన్.. ప్రధాని చాలా దిగజారి మాట్లాడారని ఆరోపించారు. సభ గౌరవాన్ని మంటగలిపారని వ్యాఖ్యానించారు. తనకు తాగుడు సమస్యే లేదని, ఇప్పటికిప్పుడు నిజాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా ఆల్కామీటర్ పరీక్ష జరగాల్సిందేనంటూ ఆవేశంగా అన్నారు. ప్రధాని మాటలను రికార్డుల్లో నుంచి తొలగించకుంటే తాను ఫిర్యాదు తాను ప్రివిలేజ్ కమిటీకి వెళతానని స్పష్టం చేశారు.