వాషింగ్టన్ : అమెరికాతో సహా ప్రపంచదేశాలు కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో కరోనా కట్టడికి మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ మూడు అంశాలను చెప్పారు. అందులో మొదటిది ప్రపంచదేశాల్లో అనుసరిస్తున్న లాక్‌డౌన్‌ను అమెరికాలో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో బీచ్‌లకు ఇంకా జనం వెళుతున్నారని, రెస్టారెంట్లు ఇంకా తెరచే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇలా సరిహద్దులు దాటి తిరిగితే వైరస్ విస్తరిస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ను కచ్ఛితంగా ప్రతి ఒక్కరు పాటించేలా చూడాలని బిల్‌గేట్స్ అమెరికా నాయకులకు విజ్ఙప్తి చేశారు. కార్యకలాపాలు ఆపివేయకపోవడం వల్ల భవిష్యత్తుల్లో ఆర్ధిక సమస్యలు ఎదుర్కొవడమే కాకుండా వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. (కరోనా మహమ్మారిపై బిల్‌గేట్స్ స్పందన)
ఇక కరోనా టెస్ట్‌ల విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఇదే విషయంలో న్యూయర్క్ నగరానికి సంబంధించి మాట్లాడుతూ.. నగరంలో ప్రతి రోజు 20వేల మందికి టెస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు. స్వయంగా కరోనావైరస్ సోకిందా లేదో తెలుసుకోవడానికి సెల్ఫ్ స్వాబ్ పద్దతిని సీటెల్ కరోనావైరస్ అసెస్‌మెంట్ నెట్‌వర్క్ రూపొందించిందని తెలిపారు. దీంతో తమ శాంపిల్స్‌ను తామే పరీక్షించుకునే అవకాశం ఉందన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా టెస్ట్‌ల కోసం అధిక డిమాండ్ ఉందని పేర్కొన్న బిల్‌గేట్స్.. ప్రాధాన్యత క్రమంలో పరీక్షలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో మొదట అత్యవసర సేవల్లో పనిచేస్తూ వైరస్ సోకడానికి అవకాశం ఎక్కువగా ఉన్న వారిని పరీక్షించాలని, ఆ తరువాత ఎవరైతే ఎక్కువ జబ్బుపడే ప్రదేశాల్లో ఉంటూ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వారిని అలా ప్రాధాన్యత క్రమంలో పరీక్షలు చేయాలని సూచించారు. దీంతో పాటు ఇదే క్రమాన్ని మాస్క్‌లు, వెంటిలేటర్లు అందించే విషయంలో కూడా పాటించాలని ఆయన చెప్పారు.
ఇంకా బిల్‌గేట్స్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు వేత్తలు కరోనా వాక్సిన్ కోసం 24గంటలు శ్రమిస్తున్నారని అయితే దీనికి సంబంధించి అసత్య ప్రచారాలు జరగకుండా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ మందులు కొనే విషయంలో అనవసర భయాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. వాక్సిన్ తయారికీ సంబంధించి ప్రయోగాలు చేస్తున్నామని, వేరు వేరు వ్యక్తులపై వాటిని పరీక్షిస్తున్నామని, సరైన ఫలితాలు రాగానే ఆ సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. అదేవిధంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఎవరికైతే దాని అవసరం ఎక్కువగా ఉందో వారికి అందిస్తామని తెలిపారు.
హడావిడిలో ఏదో వ్యాక్సిన్ కనిపెట్టడానికి బదులుగా మంచి ఫలితాలను ఇచ్చే వ్యాక్సిన్‌ను తయారు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ కనిపెడితే సగం యుద్దమే గెలిచినట్లు అవుతుందని.. అందరికి సరిపడేలా ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినప్పుడే పూర్తి యుద్దం గెలిచినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా 18 నెలల సమయం పడుతుందన్నారు. అయితే మంచి నిర్ణయాలు తీసుకొని, వైద్య నిపుణులు చెప్పినవి పాటిస్తే అమెరికా కొన్ని రోజుల్లో కొలుకుని యధాస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న నమ్మకం తనకి ఉందని బిల్‌గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య మంగళవారం సాయంత్రం 3873కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 865 మంది మృత్యువాతపడడం గమనార్హం. ఇక ఇప్పటివరకు 188172 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలు దాటగా... 40 వేల మందికి పైగా మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment