కంప్యూటర్లతో కాదు కోళ్లతో..
పేదరిక నిర్మూలనకు బిల్‌గేట్స్ పరిష్కారం
వాషింగ్టన్: పేదరిక నిర్మూలనకు కంప్యూటర్లు పనికిరావని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తెలిపారు. ప్రపంచంలోని పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌తో పనిలేదని.. వారు (పేదలు) కోళ్లు పెంచుకుంటే సరిపోతుందని గేట్స్‌నోట్స్.కామ్‌లో ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్, హీఫర్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఆఫ్రికాలోని సహారా ఎడారి దక్షిణ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు లక్ష కోళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రాంతంలో మేలురకం కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించటం వల్ల ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచవచ్చని బిల్‌గేట్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కేవలం 5 శాతం మంది మాత్రమే కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారని దీన్ని 30 శాతానికి పెంచటమే తమ లక్ష్యమని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ‘కోళ్ల పెంపకానికి చాలా తక్కువ మొత్తమే ఖర్చవుతుంది. కానీ ఇవి చాలా వేగంగా గుడ్లను, చికెన్‌ను ఇస్తాయి. దీని వల్ల ఆదాయం తద్వారా మహిళా సాధికారత పెరుగుతాయి’ అన్నారు. ఈ డబ్బును మహిళలు తిరిగి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు.