
నోట్ల రద్దుపై చైనా మీడియా ఏమందో తెలుసా?
బీజింగ్: భారత్ లో పెద్ద నోట్లు రద్దు చేయడం సాహసోపేతమైన చర్యగా చైనా ప్రభుత్వ మీడియా వర్ణించింది. నల్లధనం నియంత్రణకు ఇదొక్కటే సరిపోదని పేర్కొంది. అవినీతికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని చైనా జాతీయ ఆంగ్ల దినపత్రిక ’గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. డబ్బుతోనే కాకుండా బంగారం, రియల్ ఎస్టేట్, విదేశీ ఆస్తులతోనూ చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచించింది.
‘అవినీతిని నిర్మూలించడానికి చాలా మార్గాలున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా మాత్రమే అవినీతిని అంతం చేయలేర’ని పేర్కొంది. భారత్ ను అవినీతి రహితంగా చేయాలంటే పెద్ద నోట్ల ఉపసంహరణ మాత్రమే చాలదని, వ్యవస్థలను సంస్కరించాలని సూచించింది. ఈ విషయంలో సలహాల కోసం బీజింగ్ వైపు చూడాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అవినీతి నిర్మూలనకు చైనా అనుసరిస్తున్న విధానాలు బాగా ఉపకరిస్తాయని తెలిపింది.
మోదీ సర్కారు తిరుగులేని నిర్ణయం తీసుకుందని కామెంటేటర్ అయి జున్ వ్యాఖ్యానించారు. అక్రమంగా జరుగుతున్న వ్యాపారమంతా ఎక్కువగా డబ్బుతోనే జరుగుతోందన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. అవినీతిపై పోరును మోదీ ఉధృతం చేయాల్సిన ఉందని అభిప్రాయపడ్డారు. మోదీ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.