
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబుల మోత తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్రమాణస్వీకారం వేళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు జరిగాయి. అష్రఫ్ ఘని వేదికపై ప్రసంగిస్తున్న ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. బాంబు పేలుళ్ల శబ్ధాలు విని షాక్ తిన్న ఆయన ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించడంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు సైతం అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు ఆయన ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించకుండానే ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
బాంబు పేలుళ్ల సంభవించడంతో ఘనీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తల తెగిపడుతున్నా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. బాంబు దాడికి పాల్పడ్డది ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా, గత నెలలో అధ్యక్ష ఫలితాలు ప్రకటించగా.. అష్రఫ్ ఘని విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఘని ప్రమాణ స్వీకారం చేయడం ఇది వరసగా రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment