కారు బాంబు పేలి.. 25 మంది మృతి!
ఇస్లామాబాద్(పాకిస్తాన్): పాకిస్తాన్‌లోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం బలూచిస్థాన్ ప్రావిన్సులో శక్తిమంతమైన బాంబు పేలుడుతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్తుంగ్ పట‍్టణంలోని మసీదులో జరిగిన ఓ కార్యక్రమానికి సెనేట్ డిప్యూటీ ఛైర్మన్ మౌలానా అబ్దుల్ గఫూర్ హైద్రి హాజరయ్యారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది.
దీంతో అక్కడికక్కడే 25 మంది చనిపోగా మరో 35 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో హైద్రికి కూడా గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయింది. క్షతగాత్రులందరినీ ముస్తుంగ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకులెవరనేది తెలియరాలేదు.