మాంచెస్టర్ కాలేజీలో బాంబు భయం!
నిన్న కాక మొన్నే ఒక సంగీత కార్యక్రమంలో బాంబు పేలుడుతో ఉలిక్కిపడ్డ మాంచెస్టర్ నగరం మరోసారి భయంతో చిగురుటాకులా వణికిపోయింది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నగర శివార్లలో గల ట్రాఫర్డ్ నగరంలో ఒక కాలేజీలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే బాంబు నిర్వీర్య దళం అక్కడకు చేరుకుని అనుమానాస్పదంగా కనిపించిన ప్యాకెట్‌ను గుర్తించి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే అందరూ అనుమానించినట్లుగా అందులో బాంబు ఏమీ లేదని బ్రిటిష్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ నిపుణులు చెప్పారు.
మాంచెస్టర్ ఎరెనాలో జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించడం, మరో 64 మంది గాయపడటంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం రేగింది. దాంతో అనుమానాస్పద స్థితిలో ఏ వస్తువు కనిపించినా భయపడుతున్నారు. తాజాగా కాలేజి ఘటనలోనూ ఇలాగే జరిగింది. ఎవరికీ సంబంధం లేకుండా ఒక ప్యాకెట్ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు తెలిపారు. అయితే అందులో బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.