Bomb Disposal Squad
-
చర్లలో బాంబు కలకలం
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో శుక్రవారం బాంబు ఉందన్న వార్త కలకలం సృష్టించింది. సుమారు ఆరున్నర గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చర్ల బస్టాండ్ ముందు ఉన్న మూడు రోడ్ల కూడలిలో ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్‌లో బస్సు దిగిన గుర్తు తెలియని వ్యక్తి (మావోయిస్టు) బయటకు వెళ్తూ బస్టాండ్ ముందు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను గమనించాడు. అతని వద్ద ఉన్న బ్యాగును ఔట్‌గేట్‌లో వదిలిపెట్టి బస్టాండ్‌లోకి కొంత దూరం సాధారణంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి పరుగెత్తాడు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐ రాజువర్మ ప్రత్యేక బలగాలతో అక్కడకు చేరుకుని బ్యాగును పరిశీలించారు. బాంబు ఉన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొత్తగూడెం నుంచి బాంబు డిస్పోజల్ టీంను పిలిపించారు. ఉదయం 8.30కి బాంబును గుర్తించగా, మధ్యాహ్నం వరకు నిర్వీర్యం చేయకపోవడంతో ఏమి జరుగుతుందోనంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు బ్యాగును తాడు సహాయంతో లాక్కెళ్లి బస్టాండ్ వెనుక ఉన్న చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి బాంబును నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో వచ్చిన భారీ పేలుడు శబ్దానికి జనం భయభ్రాంతులకు గురయ్యారు. -
మాంచెస్టర్ కాలేజీలో బాంబు భయం!
నిన్న కాక మొన్నే ఒక సంగీత కార్యక్రమంలో బాంబు పేలుడుతో ఉలిక్కిపడ్డ మాంచెస్టర్ నగరం మరోసారి భయంతో చిగురుటాకులా వణికిపోయింది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నగర శివార్లలో గల ట్రాఫర్డ్ నగరంలో ఒక కాలేజీలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. వెంటనే బాంబు నిర్వీర్య దళం అక్కడకు చేరుకుని అనుమానాస్పదంగా కనిపించిన ప్యాకెట్‌ను గుర్తించి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే అందరూ అనుమానించినట్లుగా అందులో బాంబు ఏమీ లేదని బ్రిటిష్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ నిపుణులు చెప్పారు. మాంచెస్టర్ ఎరెనాలో జరిగిన బాంబు పేలుడులో 22 మంది మరణించడం, మరో 64 మంది గాయపడటంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం రేగింది. దాంతో అనుమానాస్పద స్థితిలో ఏ వస్తువు కనిపించినా భయపడుతున్నారు. తాజాగా కాలేజి ఘటనలోనూ ఇలాగే జరిగింది. ఎవరికీ సంబంధం లేకుండా ఒక ప్యాకెట్ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు తెలిపారు. అయితే అందులో బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
తిరుమలలో కారు కలకలం
తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అనుమానాస్పద పరిస్థితుల్లో కారు కనిపించడంతో కలకలం రేగింది. యాత్రికుల వసతి సముదాయం వద్ద రెండు నెలలుగా ఓ కారును ఆపి ఉంచారు. ఈ విషయం భద్రతాధికారుల దృష్టికి రావడంతో బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ సిబ్బందిని రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం బయట వ్యాపిండంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. -
పాట్నా గాంధీ మైదాన్‌లో మరో బాంబు
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ రోజు ఉదయం మరో బాంబును కనుగొన్నట్లు నగర పోలీసు ఉన్నతాధికారి మను మహారాజ్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. దాంతో బాంబును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు, బాంబు నిర్వీర్య దళం హుటాహుటిన గాంధీ మైదానం చేరుకుని, ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా ఆ సమీపంలోని ప్రజలను నివాసాల నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గాంధీ మైదాన్‌లో పాదచారులు నడుస్తున్న సమయంలో ఆ బాంబును కనుగొని, పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో హూంకార్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 8 మంది మరణించారు. మరో 82 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ వరుస బాంబు పేలుళ్ల వెనక ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.