సంరక్షణాలయం ముందు అట్టపెట్టెలో రిని, పక్కనే ఆండ్రూ రాసిన లేఖ
మిచిగాన్ : ఎంతో ఆప్యాయంగా తను పెంచుకుంటున్న కుక్కపిల్లను తండ్రి దురుసు ప్రవర్తన కారణంగా దూరంచేసుకున్నాడో బాలుడు. దాన్ని ఓ సంరక్షణాలయం దగ్గర వదిలేసి తాను కుక్కపిల్లను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో తెలుపుతూ ఓ లేఖ పెట్టాడు. ఆ లేఖను చదివిన అక్కడివారి మనసు కదిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని మిచావోకాన్‌కు చెందిన 12 ఏళ్ల ఆండ్రూ అనే బాలుడు ఓ పిట్‌బుల్ డాగ్‌ను పెంచుకుంటున్నాడు. అయితే అతడి తండ్రికి ఆ కుక్క ఇంట్లో ఉండటం నచ్చలేదు. ప్రతిరోజూ దాన్ని హింసించేవాడు.. దురుసుగా ప్రవర్తించేవాడు, ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. తండ్రి తన ప్రియమైన కుక్కతో దురుసుగా ప్రవర్తించటం ఆండ్రూకు నచ్చేది కాదు. తండ్రి కుక్కను అమ్మేయాలనుకున్న నేపథ్యంలో ఆండ్రూ మనసు కలత చెందింది. ఎలాగైనా తన కుక్కను రక్షించాలనుకున్నాడు. ఫిబ్రవరి 13న దాన్ని ఓ అట్టపెట్టెలో ఉంచి అక్కడికి దగ్గరలోని మెక్సికన్ సంరక్షణాలయం ముందు వదిలేశాడు. అక్కడ బాక్సులో కుక్కపిల్ల ఉండటం గమనించిన సంరక్షణాలయం వారు దాన్ని బయటకు తీశారు. అందులో కుక్కతో పాటు ఓ లేఖ ఉండటం గమనించారు.
ఆ లేఖలో ... ‘‘ నా పేరు ఆండ్రూ. నా వయసు 12 సంవత్సరాలు. నేను, మా అమ్మ ఈ కుక్కపిల్లను మీ చేతుల్లో వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే మా నాన్ననుంచి దీన్ని రక్షించాలని. మా నాన్న దీన్ని అమ్మేయాలనుకుంటున్నాడు. ప్రతిరోజూ దాంతో దురుసుగా ప్రవర్తించేవాడు, కొట్టేవాడు. ఓ రోజు దాన్ని కాలుతో చాలా గట్టిగా తన్నాడు. దీంతో దాని తోకకు గాయమైంది. మీరు దీనికి సహాయం చేస్తారనుకుంటున్నాను. ఇది నన్ను మర్చిపోదని నా నమ్మకం’’. ఆ సంరక్షణాలయం వారు ఆ లేఖను ఫేస్‌బుక్‌లో ఉంచటంతో కుక్కపిల్ల ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో 300మందికిపైగా దాన్ని దత్తత తీసుకోవటానికి ముందుకొచ్చారు. సంరక్షణాలయం సిబ్బంది దానికి రిని అని పేరు కూడా పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment