కార్న్ ఫ్లోర్ తినకుంటే కోమాలోకి...
ఆ చిన్నారిని ప్రాణాంతక వ్యాధి పీడిస్తోంది. ఆ వింత వ్యాధి అతడిని రోజురోజుకూ చావుకు దగ్గర చేస్తోంది. తమ బిడ్డకు సంక్రమించిన వ్యాధికి మందులు లేకపోవడంతో తల్లిదండ్రులు అనుక్షణం ఆందోళనకు గురౌతున్నారు. బిడ్డ ప్రాణాలు రక్షించుకోడానికి లక్షల్లో డబ్బు ఖర్చు చేస్తున్నారు. లండన్ కు చెందిన ఆరేళ్ల జార్జి మొర్రిసన్ ను అరుదైన గ్లికోజెన్ స్టోరేజ్ వ్యాధి (GSD) వేధిస్తోంది. అయితే ఆ కొత్తరకం వ్యాధికి ఇప్పటిదాకా మందులే లేకపోవడంతో వైద్యులు ప్రత్యామ్నాయంగా కార్న్ ఫ్లోర్ ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ సుమారు ఓ బాక్స్ కార్న్ ఫ్లోర్ తినకుంటే ఆ బాలుడు కోమాలోకి వెళ్ళిపోతున్నాడు.
జార్జి మొర్రిసన్ కు ఎనిమిది నెలల వయసున్నపుడే వైద్యులకు కూడా అంతు చిక్కని ఓ వింత వ్యాధి సోకింది. ప్రాణాంతకమైన ఆ వ్యాధికి మందుల్లేకపోవడంతో కార్న్ ఫ్లోర్ వినియోగిస్తున్నారు. రోజుకో కార్న్ ఫ్లోర్ డబ్బా తినకపోతే చిన్నారి చనిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. లండన్ లోని మిగతా పిల్లల్లో మరెక్కడా కనిపించని ప్రాణాంతక గ్లైకోజెన్ లోపంతో మొర్రిసన్ బాధపడుతున్నాడు. రాత్రి సమయంతో సహా ప్రతి మూడు గంటలకు ఓసారి కార్న్ ఫ్లోర్ తినిపిస్తూ ఆ బాలుడ్ని ప్రమాదానికి దూరంగా ఉంచాల్సి వస్తోంది.
ఎనిమిదేళ్ళు దాటని పసివాడు కావడంతో అన్నిరకాల పరీక్షలు చేసే అవకాశం లేదు. అందుకే అతడి లోపానికి ఫార్మసిస్టులు ప్రత్యామ్నాయాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీ జాబితాలోని మందుల్లో ఎక్కడా కార్న్ ఫ్లోర్ ను వాడే పద్ధతి అమల్లో లేదు. అయితే ఓ ఫార్మాసూటికల్ రిఫరెన్స్ పుస్తకంలో ఉన్న సలహాల మేరకు బాలుడి లోపానికి కార్న్ ఫ్లోర్ ను వాడుతున్నారు.
తమ బిడ్డకు వచ్చిన వ్యాధికి మందులు లేకపోవడంతో జార్జి తల్లిదండ్రులు సామ్, పెటె మొర్రిసన్ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిగిలిన పిల్లల్లా తమ చిన్నారికి మందులు ఎందుకు ఇవ్వరంటూ నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ను వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కార్న్ ఫ్లోర్ వాడే పద్ధతి ఎంతో కష్టంగా ఉండటంతోపాటు ఖర్చు కూడ ఎక్కువగా ఉందని, దానికి బదులుగా మందులు సూచించమని ఎన్ హెచ్ ఎస్ ను కోరుతున్నారు.
జార్జికి కేవలం ఎనిమిది నెలల వయసున్నపుడే ఈ వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు నిర్థారించారని, అప్పట్నుంచీ మందుల్లేకుండా పిల్లాడి ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో కష్టంగా మారిందని సామ్ ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వింత వ్యాధికి మందు కనిపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తాము ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమౌతున్నట్లు చెప్తున్నాడు. ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు కావడంతో ఇకపై జార్జికి వైద్య సహాయంకోసం స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాడు.