
త్వరలో ఫేస్‌బుక్ నుంచి ‘బ్రేకింగ్ న్యూస్ అలర్ట్’
వాషింగ్టన్: ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్తలను చూసేవారు రోజురోజూకీ ఎక్కువైపోతున్నారు. అందుకే వివిధ వార్తాసంస్థలు మొబైల్ యాప్‌లు రూపొందించి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటికి పోటీగా ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌సైట్లు కూడా మొబైల్ న్యూస్ యాప్‌లను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ట్విటర్ మొబైల్ న్యూస్ ట్యాబ్‌ను రూపొందించి తాజా వార్తలను వినియోగదారులకు అందిస్తోంది.
ఫేస్‌బుక్ కూడా త్వరలో ఆ బాటలోనే నడవనుంది. మొబైల్ వినియోగదారులకు ఫేస్‌బుక్ ద్వారా తాజావార్తలను అందించేందుకు మొబైల్ ఫేస్‌బుక్ యాప్‌లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రయోగం పరీక్ష దశలోనే ఉంది. త్వరలోనే ఫేస్‌బుక్ బ్రేకింగ్ న్యూస్ అలర్ట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలపారు.