
బ్రిటన్ తొలి క్లోనింగ్ డాగ్.. మినీ విన్నీ!
ఇంకా కళ్లు కూడా తెరవని ఈ బుజ్జి కుక్కపిల్ల బ్రిటన్‌కు చెందిన తొలి క్లోనింగ్ డాగ్. పశ్చిమ లండన్ మహిళ రెబెక్కా స్మిత్ పెంపుడు కుక్క విన్నీ చర్మ కణాలతో దక్షిణ కొరియాలోని ఓ ల్యాబ్‌వారు దీనిని సృష్టించారు. పొట్టికాళ్లు, పొడవాటి శరీరం ఉండే డాక్‌శాండ్ జాతికి చెందిన 12 ఏళ్ల విన్నీ అంటే రెబెక్కాకు చాలా ఇష్టం. ఒకవేళ అది చనిపోతే? అన్న ఆలోచనతో దిగులు చెందిన ఆమె.. అచ్చం దానిలాగే ఉండే క్లోన్డ్ కుక్కను సృష్టించుకోవాలని భావించింది. దక్షిణ కొరియాలోని సోయామ్ బయోటెక్ ల్యాబ్‌వారిని సంప్రదించింది. వారు విన్నీ చర్మకణాలను సేకరించారు. ఆ కణాల్లోంచి ఒకదానిని ఎన్నుకుని దానిలోంచి కేంద్రకాన్ని వేరుచేశారు. తర్వాత డాక్‌శాండ్ జాతికే చెందిన మరో శునకం అండంలో కేంద్రకాన్ని తొలగించి, విన్నీ కేంద్రకాన్ని ఆ కుక్క అండంలో ప్రవేశపెట్టి విద్యుత్ షాక్‌తో ఫలదీకరణం చెందించారు.
అనంతరం మరో కుక్కను ఎంచుకుని దాని గర్భంలో ఈ పిండాన్ని ప్రవేశపెట్టారు. ఇంకేం.. గత నెల 30వ తేదీన మినీ విన్నీ ఈ లోకంలోకి వచ్చేసింది. దీన్ని క్లోన్ చేసేందుకు ల్యాబ్‌వారు 60 వేల పౌండ్లు (రూ. 60 లక్షలు) వసూలుచేశారట. అయితే 1996లో ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్ ద్వారా డాలీ అనే గొర్రెను సృష్టించి చరిత్రకెక్కిన సర్ ఇయాన్ విల్మట్ మాత్రం కుక్కల క్లోనింగ్‌పై పెదవి విరుస్తున్నారు. ఇంత డబ్బు తగలేసి వాటిని సృష్టించినా.. అవి రూపంలో ఒకేలా పుట్టినప్పటికీ, వాటి ప్రవర్తన వివిధ కారణాల వల్ల మారిపోవచ్చని, అప్పుడు యజమానులకు తీవ్ర నిరాశ తప్పదని అంటున్నారు.