ముందస్తు ఎన్నికలకు పార్లమెంట్ ఆమోదం
ముందస్తు ఎన్నికలకు పార్లమెంట్ ఆమోదం
Published Wed, Apr 19 2017 8:09 PM | Last Updated on Thu, Sep 6 2018 2:53 PM
లండన్ : బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే అనూహ్య నిర్ణయానికి పార్లమెంట్ మద్దతుగా నిలిచింది. జూన్ 8న ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే థెరెసా నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ముందస్తు ఎన్నికల నిర్ణయంపై నేడు జరిగిన ఓటింగ్ ప్రక్రియలో 522 మంది సభ్యులు ముందస్తు ఎన్నికల నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయగా.. 13 మంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మొత్తం బ్రిటన్ పార్లమెంట్లో 650 మంది సిట్టింగ్ ఎంపీలున్నారు. మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ థెరెసా మే, మూడేళ్లు ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు..
మంగళవారం ప్రధానమంత్రి మే తన డౌనింగ్ స్ట్రీట్ నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక దేశంలో కొన్నేళ్లపాటు రాజకీయ సుస్థిరత నెలకొనాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. దీంతో బ్రిటిష్ రాజకీయాల్లో మరో లేటెస్ట్ ట్విస్ట్గా ముందస్తు ఎన్నికలు చర్చకు వచ్చాయి. గతేడాదే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగి, ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్రెగ్జిట్ రెఫరాండం ముగియగానే, ఆ దేశ ప్రధానిగా ఉన్న డేవిడ్ కామెరూన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మే ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ముందస్తు ఎన్నికల ప్రక్రియ బ్రెగ్జిట్ చర్చలను జాప్యం చేయనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement