లండన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విధ్వంసంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశాలు ఈ మహమ్మారి బారినపడి విలవిలలాడుతున్నాయి. కరోనా విజృంభణపై లండన్ ఇంపీరియల్ కాలేజ్ జీవగణితం ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ నేతృత్వంలోని బృందం చేపట్టిన అథ్యయనం మహమ్మారి ఏస్ధాయిలో మానవాళిని కబళిస్తుందో కళ్లకు కట్టింది. కరోనా భారీగా విస్తరించిన ఇటలీలోని తాజా డేటాను విశ్లేషిస్తూ ఈ అథ్యయనం రాబోయే రోజుల్లో పరిణామాలను అంచనా వేసింది. కొవిడ్-19ను 1918లో వ్యాపించిన ఫ్లూతో పోల్చిన అథ్యయనం కరోనాను కట్టడి చేసే చర్యలు కొరవడటంతో అమెరికాలో 22 లక్షల మంది, బ్రిటన్‌లో 5 లక్షల మంది మరణిస్తారని పేర్కొంది. మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి అనుమానిత కేసులను ఇంటి వద్దే ఒంటరిగా ఉంచడం వంటి చర్యలు ఫలితాలను ఇచ్చినా ముందస్తుగా జనజీవనంపై ఆంక్షలు విధించకపోవడంతో 2,50,000 మంది మరణిస్తున్నారని, ఆరోగ్య వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయని అధ్యయనం తెలిపింది.
ప్రజలు ఎక్కువగా కలిసే థియేటర్లు, మాల్స్, క్లబ్‌లు, పబ్‌లను మూసివేయడం, సామాజిక దూరం పాటించడం వల్ల ఈ మహమ్మారి విస్తృత వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తెలిపింది. ఈ చర్యలు సామాజికంగా, ఆర్థికంగా మనపై భారీ ఒత్తిడిని కలిగిస్తాయని ఈ అథ్యయనంలో ఫెర్గూసన్‌తో కలిసి పనిచేసిన ఎపిడెమాలజీ ప్రొఫెసర్ అజ్రా ఘని అన్నారు. కాగా ఈ అథ్యయనంలో పేర్కొన్న అంచనాలు గడ్డుకాలం ముందుందనే సంకేతాలు పంపుతోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ఎపిడెమాలజీ నిపుణులు టిమ్ కొలబన్ హెచ్చరించారు. ఇక ఈ అథ్యయనంతో బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిపుణుల సూచనలను ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో పొందుపరుస్తామని పేర్కొంది. బొరిస్ జాన్సన్ సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సరైన చర్యలు చేపట్టలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఈ అథ్యయనం వివరాలు వెలువడటం గమనార్హం. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడం వంటి చర్యలు చేపట్టగా బ్రిటన్ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment