విమానాల్లో ఖతార్‌కు ఆవులు!
ఖత్తర్: సౌదీ అరేబియా సహా అయిదు తోటి అరబ్ దేశాల ఆంక్షలతో అల్లాడుతున్న ఖతార్ రకరకాల పద్ధతుల్లో ముందుకు సాగుతోంది. పాల కొరత నివారణకు నాలుగు వేల ఆవులను ఆస్ట్రేలియా, అమెరికా నుంచి విమానాల్లో దేశానికి తరలించడానికి ఖతారీ వ్యాపారి మౌతాజ్ అల్ ఖయ్యత్ ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఈ ఆవుల రవాణాకు ఖతార్ ఎయిర్‌వేస్‌కు 60 విమాన సర్వీసులు అవసరమౌతాయి. మొన్నటి వరకూ ఖతార్ తన ఆహారపదార్థాల్లో 80 శాతం పొరుగున ఉన్న పెద్దదేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే దిగుమతి చేసుకునేది.
ఉగ్రవాదానికి ఊతమిస్తోందనే నెపంతో సౌదీ, దాని అనుకూల దేశాలు నిత్యావసరాలను తమ దేశాల మీదుగా ఖతార్‌కు రవాణా కాకుండా నిలిపివేయవేశాయి. దీంతో ఖయ్యత్ మాదిరి అత్యవసర పరిష్కార మార్గాలు కనుగొనాల్సివస్తోంది. దేశ రాజధాని దోహా సమీపంలో ఏర్పాటుచేసిన డైరీ ఫారానికి మొదట ఈ ఆవులను నౌకల్లో తీసుకురావాలని అనుకున్నా సౌదీ, దాని మిత్ర దేశాల ఆంక్షలతో విమానాల్లో తరలించాలని నిర్ణయించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోందని పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ అనే బడా కంపెనీ చైర్మన్ అయిన అల్ ఖయ్యత్ చెప్పారు. తొలుత అనుకున్నట్టు సెప్టెంబర్‌లో కాకుండా జూన్ ఆఖరు నాటికి కొత్త డయిరీ ఫారంలో పాల ఉత్పత్తి ఆరంభమౌతుందనీ, జులై మధ్యనాటికి ఖతార్ మూడో వంతు పాల అవసరాలను తీరుస్తామని ఆయన వివరించారు. మరో పక్క సోమవారం 100 టన్నుల ఆహారపదార్థాలు, కూరగాయలు, పండ్లు ఐదు విమానాల్లో ఖతార్ పంపామని ఇరాన్ ప్రకటించింది.
ఆదుకుంటున్న ఇరాన్, టర్కీ!
ఖతార్‌తో తన భూ సరిహద్దును సౌదీ అరేబియా మూసివేయడంతో ఈ ద్వీపకల్ప దేశంలో తిండి కొరత తీవ్రమౌతుందనే భయాందోళలనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.దుకాణాలు, మాల్స్ వద్ద తొక్కిసలాట వాతావరణ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఖతార్‌ను అమెరికా, సౌదీ పాలకులకు బద్ధశత్రువైన ఇరాన్‌తోపాటు పాత మిత్రదేశం టర్కీ వెంటనే సరుకులు పంపి ఆదుకున్నాయి. ఆరు రోజుల నుంచి టర్కీ ఆహారపదార్థాలను రోజూ మూడు టర్కిష్ ఎయిర్‌లైన్స్ సర్వీసుల ద్వారా ఖతార్‌కు సరఫరాచేస్తోంది. టర్కీ నుంచి ఐదు రోజుల్లో దిగుమతయ్యే పాలు, పాల ఉత్పత్తులు సహా తినే సరకుల విలువ 50 లక్షల టర్కిష్ లీరాలకు చేరుకుంది.
సౌదీ అరేబియా ఆంక్షలు పనిచేయకుండా టర్కీ ఇలా ఖతార్‌ను ఆదుకోవడంతో సౌదీ అరేబియాలో టర్కిష్ సరకులు కొనకుండా బహిష్కరించాలనే ప్రచారోద్యమం ట్విటర్‌లో మొదలైంది. టర్కిష్ లీరా, ఖతారీ రియాల్ విలువ దాదాపు సమానం. మారిన పరిస్థితుల్లో టర్కిష్ లీరా విలువ 30 శాతం పెరిగింది. చివరికి సౌదీలో బాగా జనాదరణ పొందిన టర్కీ టెలివిజన్ సీరియల్స్ కూడా చూడద్దొని, టర్కీ పర్యటనకు వెళ్లొద్దని కూడా కొందరు కోరడం విశేషం. ఊహించని కష్టాల్లో చిక్కుకున్న ఖతార్‌కు తక్షణమే సాయం అందించి, 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఏర్పాట్లలో కాంట్రాక్టులు సంపాదించాలని టర్కీ నిర్మాణ సంస్థలు ఆశిస్తున్నాయి.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)