COWS TRANSPORT
-
భారీగా పశువుల అక్రమ రవాణా
చేవెళ్ల రంగారెడ్డి : బక్రీద్ పండుగ నేపథ్యంలో చెక్‌పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో పశువులను అమ్మకానికి తరలిస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ గురవయ్య తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ చౌరస్తాలో ఉన్న చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీ చేపట్టారు. చేవెళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి నాలుగు వాహనాల్లో పశువులను తరలిస్తున్నారు. పోలీసులు వాహనాలను నిలిపి తనిఖీ చేస్తుండగా వాటిల్లో 44 ఆవు దూడలు ఉన్నాయి. వాహనాలను స్వాధీనం చేసుకొని, తొమ్మిది మంది నిందితులు మహ్మద్ ఖదీర్, జహంగీర్, అఫ్సర్, వెంకటేష్, మల్కప్ప, సాజిద్, ఫరూక్ ఖాన్, అర్షద్‌ఖాన్, సయ్యద్ యాసిన్‌లను అరెస్టు చేశారు. సంతలో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. ఆవు దూడలను జీడిమెట్లలోని గోశాలకు తరలించినట్లు సీఐ చెప్పారు. -
ఆవులను పట్టుకున్న పోలీసులు
తాండూరు రూరల్ వికారాబాద్ : ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆవులను కరన్‌కోట్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్ ఎదుట నుంచి వెళ్తున్న ఆవులను తోలుకెళ్తున్న వ్యక్తులను ఆపి వివరాలు అడిగారు. ఆవుల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు ఆవులను తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, బజరంగ్దళ్, బీజేపీ, ఏబీవీపీ నాయకులు కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆవులను ఎక్కడికి తరలిస్తున్నారని వ్యక్తులను ప్రశ్నించారు. యాలాల మండలం జుంటుపల్లి అనుబంధ గ్రామం రేళ్లగడ్డతండా నుంచి 33 ఆవులను తాండూరు మండలం రాంపూర్‌తండాకు తీసుకెళ్తున్నమని వారు చెప్పారు. సరైన సమాధానం చెప్పాలని కోరగా తాండూరుకు చెందిన సాధిక్ ఈ ఆవులను రూ.1.60 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్ఐ రేణుకారెడ్డితో నాయకులు భేటీ అయ్యారు. బక్రీద్ సందర్భంగా ఆవులను విక్రయించడానికి తీసుకెళ్తున్నారని వారు ఆరోపించారు. తాండూరు చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఎస్ఐ స్పందిస్తూ ఆవులకు సంబంధించిన పూర్తి విచారణ చేపడతామన్నారు. అప్పటి వరకు ఆవులను పట్టణంలోని గోశాలకు తరలిస్తామని చెప్పారు. ఆవులను తీసుకెళ్తున్న వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రమ్యానాయక్, బొప్పి సురేష్, టైలర్ రమేష్, రజనీ, అశోక్, నాగేష్, దాస్, మహేష్ పాల్గొన్నారు. -
విమానాల్లో ఖతార్‌కు ఆవులు!
ఖత్తర్: సౌదీ అరేబియా సహా అయిదు తోటి అరబ్ దేశాల ఆంక్షలతో అల్లాడుతున్న ఖతార్ రకరకాల పద్ధతుల్లో ముందుకు సాగుతోంది. పాల కొరత నివారణకు నాలుగు వేల ఆవులను ఆస్ట్రేలియా, అమెరికా నుంచి విమానాల్లో దేశానికి తరలించడానికి ఖతారీ వ్యాపారి మౌతాజ్ అల్ ఖయ్యత్ ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఈ ఆవుల రవాణాకు ఖతార్ ఎయిర్వేస్కు 60 విమాన సర్వీసులు అవసరమౌతాయి. మొన్నటి వరకూ ఖతార్ తన ఆహారపదార్థాల్లో 80 శాతం పొరుగున ఉన్న పెద్దదేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే దిగుమతి చేసుకునేది. ఉగ్రవాదానికి ఊతమిస్తోందనే నెపంతో సౌదీ, దాని అనుకూల దేశాలు నిత్యావసరాలను తమ దేశాల మీదుగా ఖతార్‌కు రవాణా కాకుండా నిలిపివేయవేశాయి. దీంతో ఖయ్యత్ మాదిరి అత్యవసర పరిష్కార మార్గాలు కనుగొనాల్సివస్తోంది. దేశ రాజధాని దోహా సమీపంలో ఏర్పాటుచేసిన డైరీ ఫారానికి మొదట ఈ ఆవులను నౌకల్లో తీసుకురావాలని అనుకున్నా సౌదీ, దాని మిత్ర దేశాల ఆంక్షలతో విమానాల్లో తరలించాలని నిర్ణయించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోందని పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ అనే బడా కంపెనీ చైర్మన్ అయిన అల్ ఖయ్యత్ చెప్పారు. తొలుత అనుకున్నట్టు సెప్టెంబర్‌లో కాకుండా జూన్ ఆఖరు నాటికి కొత్త డయిరీ ఫారంలో పాల ఉత్పత్తి ఆరంభమౌతుందనీ, జులై మధ్యనాటికి ఖతార్ మూడో వంతు పాల అవసరాలను తీరుస్తామని ఆయన వివరించారు. మరో పక్క సోమవారం 100 టన్నుల ఆహారపదార్థాలు, కూరగాయలు, పండ్లు ఐదు విమానాల్లో ఖతార్ పంపామని ఇరాన్ ప్రకటించింది. ఆదుకుంటున్న ఇరాన్, టర్కీ! ఖతార్‌తో తన భూ సరిహద్దును సౌదీ అరేబియా మూసివేయడంతో ఈ ద్వీపకల్ప దేశంలో తిండి కొరత తీవ్రమౌతుందనే భయాందోళలనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.దుకాణాలు, మాల్స్ వద్ద తొక్కిసలాట వాతావరణ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఖతార్‌ను అమెరికా, సౌదీ పాలకులకు బద్ధశత్రువైన ఇరాన్‌తోపాటు పాత మిత్రదేశం టర్కీ వెంటనే సరుకులు పంపి ఆదుకున్నాయి. ఆరు రోజుల నుంచి టర్కీ ఆహారపదార్థాలను రోజూ మూడు టర్కిష్ ఎయిర్‌లైన్స్ సర్వీసుల ద్వారా ఖతార్‌కు సరఫరాచేస్తోంది. టర్కీ నుంచి ఐదు రోజుల్లో దిగుమతయ్యే పాలు, పాల ఉత్పత్తులు సహా తినే సరకుల విలువ 50 లక్షల టర్కిష్ లీరాలకు చేరుకుంది. సౌదీ అరేబియా ఆంక్షలు పనిచేయకుండా టర్కీ ఇలా ఖతార్‌ను ఆదుకోవడంతో సౌదీ అరేబియాలో టర్కిష్ సరకులు కొనకుండా బహిష్కరించాలనే ప్రచారోద్యమం ట్విటర్లో మొదలైంది. టర్కిష్ లీరా, ఖతారీ రియాల్ విలువ దాదాపు సమానం. మారిన పరిస్థితుల్లో టర్కిష్ లీరా విలువ 30 శాతం పెరిగింది. చివరికి సౌదీలో బాగా జనాదరణ పొందిన టర్కీ టెలివిజన్ సీరియల్స్ కూడా చూడద్దొని, టర్కీ పర్యటనకు వెళ్లొద్దని కూడా కొందరు కోరడం విశేషం. ఊహించని కష్టాల్లో చిక్కుకున్న ఖతార్‌కు తక్షణమే సాయం అందించి, 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఏర్పాట్లలో కాంట్రాక్టులు సంపాదించాలని టర్కీ నిర్మాణ సంస్థలు ఆశిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆవుల తరలింపు గుట్టురట్టు
ప్రమాదానికి గురైన వాహనం అపస్మారక స్థితిలో డ్రైవర్.. ఇద్దరు పరారీ కంటైనర్‌నుంచి వంద ఆవులను వెలికితీసిన స్థానికులు ఆలమూరు : అక్రమంగా ఆవులను కబేళాలకు తరలిస్తున్న విషయం ఓ రోడ్డు ప్రమాదంతో బయటపడింది. స్థానికుల కథనం ప్రకారం పదహారో నంబరు జాతీయ రహదారిలోని జొన్నాడ జంక్షన్ వద్ద ఒడిశా నుంచి తమిళనాడు వెళుతున్న కంటైనర్ మచిలీపట్నం నుంచి మండపేట వస్తున్న లారీని శనివారం ఢీకొట్టింది. దాంతో కంటైనర్ క్యాబిన్లో ప్రయాణిస్తున్న ముగ్గురిలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. మిగిలిన ఇద్దరూ పరారయ్యారు. అది స్థానికుల్లో అనుమానాలను రేకేత్తించింది. ఈ అనుమానమే బారీ స్థాయిలో గోవుల తరలింపును గుట్టురట్టు చేసింది. రహదారికి అడ్డంగా ఉందని ఆలమూరు పోలీసులు కంటైనర్‌ను క్రేన్ సాయంతో పక్కకు తీసేందుకు ప్రయత్నించగా చాలా బరువుగా అనిపించింది. దాంతో పోలీసులు కంటైనర్ వెనుక భాగాన్ని తెరచి చూడగా భయంకరమైన పరిస్థితుల్లో గోవులు కంటబడ్డాయి. ద్విచక్రవాహనాలు తరలించే అకంటైనర్ రెండు అరల్లో సుమారు 100 ఆవులను కుక్కేశారు. పైభాగంలో ఉన్న గోవులను కాళ్లు విరిచి కదలడానికి వీలు లేకుండా కట్టిపడేశారు. స్థానిక యువకులు ఆగోవులన్నింటిని తీవ్ర ప్రయాసలకోర్చి బయటకు తీశారు. వాటిలో రెండు గోవులు మృతి చెందగా మరో ఐదు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని స్వీకరించేందుకు గో సంరక్షణ సమితి నిరాకరించడంతో స్థానిక పోలీసులు పెంచుకునేందుకు ఆసక్తి కనబర్చిన రైతులకు ఆగోవులను అప్పగించారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న కంటైనర్ డ్రైవర్‌ను ఎన్‌హెచ్ 16 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకుంటే కాని నిందితుల ఆచూకీ లభించని పరిస్థితి ఏర్పడింది. ఈమేరకు ఆలమూరు ఎస్సై ఎం.శేఖర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవుల తరలింపుపై కఠినంగా వ్యవహరించాలి రాష్ట్రంలో గోవుల తరలింపుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కొత్తపేట నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి టి.రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. అక్రమార్కులు గోవులను లారీల్లో కాకుండా కంటైనర్లలో తరలించడాన్ని బట్టి ఈవ్యాపారం ఏస్థాయిలో జరుగుతుందో అర్థమవుతుందన్నారు. గోవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా దళాన్ని నియమించాలని సూచించారు. గాయపడ్డ గోవులకు సకాలంలో వైద్యం అందలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తంచేశారు.