
రండి.. చాకోలెట్‌పై పీహెచ్‌డీ చేయండి!
లండన్: చాకోలెట్‌పై పీహెచ్‌డీనా? ఎవరీ పిలుపునిచ్చింది? అని ముక్కున వేలేసుకుంటున్నారా? లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు! చాకోలెట్ అంటే ఇష్టపడే శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎవరైనా సరే.. చాకోలెట్‌పై పరిశోధన చేయండి.. పీహెచ్‌డీ సాధించి ‘డాక్టర్ ఆఫ్ చాకోలెట్’ అని గర్వంగా చెప్పుకోండి! అంటూ ఆ వర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ విభాగం వారు ఆహ్వానిస్తున్నారు.
ఈ పీహెచ్‌డీలో భాగంగా ఏం చేయాలంటే.. చాకోలెట్లు, చాకోలెట్‌తో చేసిన ఆహార పదార్థాలు వేడి వాతావరణంలో సైతం కరిగిపోకుండా కొత్త ఫార్ములాలు కనిపెట్టాలి! ఈ ఫార్ములాలు చాకోలెట్ కంపెనీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేందుకు ఉపయోగపడాలి. ఈ కోర్సు వ్యవధి 3.5 ఏళ్లు. ఆగస్టు 29లోగా దరఖాస్తు చేసుకోవాలి. స్కాలర్‌షిప్ ఎంతో ప్రకటనలో పేర్కొనలేదు. పరిశోధనల్లో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి. అయితే ఈ చాకోలెట్ పీహెచ్‌డీలో ప్రవేశాలు యూరోపియన్ దేశాలవారికి మాత్రమే!