
ధరల విషయంలోనూ లింగ వివక్ష..?!
ధరల విషయంలోనూ లింగ వివక్ష కొనసాగుతోందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు ఒకే ఉత్పత్తి కోసం పురుషులు తక్కువ ధరను చెల్లిస్తుంటే, స్త్రీలు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని పరిశోధనల్లో తేలింది. ఎనిమిది వందల అంశాల్లో పోల్చి చూసిన అధ్యయనకారులు... పురుషులకంటే మహిళలు ఏడుశాతం ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తున్నట్లు వెల్లడించారు. ఈ ధర వివక్ష ఒక్క రిటైల్ కు మాత్రమే కాదని నివేదికలు తెలుపుతున్నాయి.
న్యూయార్క్ సిటీ వినియోగదారుల వ్యవహారాల విభాగం చేపట్టిన అధ్యయనాల్లో ధరల్లో లింగ వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించింది. దాదాపుగా ఒకే ఉత్పత్తికి పురుషులకంటే మహిళలు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలోని కొన్ని డ్రైక్లీనర్స్ దుకాణాల్లో స్త్రీ పురుషుల వస్త్రాలపై సర్వే నిర్వహించిన అధ్యయనకారులకు ధరల్లో సారూప్యత లేకపోవడం కనిపించింది. పరిమాణం ఒకేలా ఉన్నా ధరను మాత్రం పురుషులకంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తేలింది. ఒకేలాంటి రెండు వస్త్రాలను పోలిస్తే వాటిలో మహిళల వస్త్రాలకు 7.50 డాలర్లను వసూలు చేయగా... పురుషుల వస్త్రాలకు 2.85 డాలర్లు మాత్రమే వసూలు చేయడం కనిపించింది. అంటే స్త్రీలకు సంబంధించిన ఉత్పత్తులకు దాదాపు మూడు డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి వివక్ష ఒక్క డ్రైక్లీనర్స్ విషయంలోనే కాదు జీన్స్, వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులు, బొమ్మలు, స్కూటర్లు ఇలా అనేక ఉత్పత్తుల విషయంలోనూ కొనసాగుతోన్నట్లు ఈ తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. దీన్నిబట్టి మహిళలు 42 శాతం ఎక్కువగా ధరలు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది.
అయితే వస్తువుల ధరల విషయంలోనూ లింగ వివక్ష కొనసాగుతుండటం నిజమేనని కన్జూమర్ రిపోర్ట్స్ సీనియర్ ప్రాజెక్ట్ ఎడిటర్ టోడ్ మార్క్స్ అంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా మార్క్స్ ఇదే సమస్యపై పరిశోధన నిర్వహించారు. ముఖ్యంగా మహిళలే ఇటువంటి విషయాల్లో తమను తాము తక్కువ చేసుకుంటున్నారని, అదే విషయాన్ని ప్రయోజనంగా తీసుకొని ఎక్కువ డబ్బును వసూలు చేయడం జరుగుతోందని మార్క్స్ అంటున్నారు. డ్రై క్లీనర్స్ విషయంలో పరిశీలించినప్పుడు.. స్త్రీ, పురుఫుల షర్టులకు వేరు వేరు ధరలను వసూలు చేయడం కనిపించిందని, అదే అడిగితే ఇస్త్రీ మెషీన్ల విషయంలోనూ, మహిళల టాప్ లు ఫిట్టింగ్ విషయంలోనూ అనేక తేడాలుంటాయని, అందుకే అలా వసూలు చేయాల్సివస్తుందని షాపు యజమాని సైఫ్ వివరించారని మార్క్ వెల్లడించారు.
అయితే లింగ ఆధారిత ధర దోపిడీ అనేది అమెరికాలో చట్ట విరుద్ధం. దేశ వ్యాప్తంగా 1996 లో జెండర్ ట్యాక్స్ అమల్లోకొచ్చిన తర్వాత సంవత్సరానికి మహిళలు కూడ 1,351 డాలర్లు పన్ను కడుతున్నారు. అయితే చిల్లర వ్యాపారాల్లో ఈ వివక్ష నిరోధించడమే లక్ష్యంగా ఎటువంటి చట్టం లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. రిటైల్ మార్కెట్లో ధరను నిర్ణయించే వెసులుబాటు లేకపోవడమే దీనికి కారణమని ట్రేడ్ లాయర్ మైఖేల్ కోన్ అంటున్నారు. అంతేకాదు మహిళలకు సంబంధించిన వస్తువులు దిగుమతి చేసుకున్నపుడు పురుషుల ఉత్పత్తులకన్నా అధిక ఇంపోర్ట్ టాక్స్ లు పడటం కూడ దీనికి కారణమంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే వినియోగదారులే ముందుకు వచ్చి ప్రచారాన్ని చేపట్టాలని ఆయన సూచిస్తున్నారు.