ఈ ఆరేళ్ల చిన్నారి ధైర్యం చూశారో అవాక్కే..
మెల్బోర్న్: న్యూజిలాండ్లోని ఓ స్టోర్లో ఓ భారతీయ బాలిక గొప్ప సాహసం చేసింది. పట్టుమని ఆరేళ్లు కూడా ఉండని ఆ బాలిక ఏకంగా గొడ్డలితో తమ సంస్థలోని ఉద్యోగిపై దాడికి వచ్చిన దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాడి చేయబోతున్న అతడిని కాలుపట్టి లాగి కిందపడేయబోయింది. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం ఇప్పుడు పెద్ద వైరల్గా మారింది. ఆ పాప తల్లిదండ్రులు తమ కూతురు గొప్ప సాహసం చేసిందని మురిసిపోతూ ఆ సంఘటనకు సంబంధించి ఆమెలో పేరుకుపోయిన భయాన్ని తగ్గిస్తున్నారు.
న్యూజిలాండ్లోని అక్లాండ్లో ఓ ఇండియన్ దంపతులకు ఎలక్ట్రికల్ షాపు ఉంది. అందులో కొంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అనుకోకుండా ఓ ఆరుగురు దోపిడీ దారులు ముఖాలకు ముసుగులు వేసుకొని చేతుల్లో గొడ్డళ్లతో దాడి చేసేందుకు వచ్చారు. ఆ క్రమంలో అందులో పనిచేసే ఉద్యోగులను గొడ్డల్లతో నరికేందుకు ప్రయత్నించారు.
అదే సమయంలో తన తల్లిదండ్రులతోపాటే ఆ షాపులో ఉన్న సారా పటేల్ అనే ఆరేళ్ల చిన్నారి తన తండ్రి కంగారు పడుతూ అటుఇటు పరుగెడుతున్నప్పటికీ ఏమాత్రం జంకకుండా నేరుగా ఆ దొంగ కాలుపట్టి కిందపడేసేందుకు యత్నించింది. అనంతరం పోలీసులు రాక గమనించి వారంతా పరారయ్యారు. పోతూపోతూ వేల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎత్తుకెళ్లారు. కొన్నింటిని ధ్వంసం చేశారు. అయితే, వీరిని కుటుంబ సభ్యులు కార్లో వెంబడించడంతోపాటు పోలీసులు కూడా వెంటపడి అదుపులోకి తీసుకున్నారు.