కొట్టేసింది ఒకరైతే.. కొట్టింది మరొకరిని
బీజింగ్(చైనా): ఎంతో ఇష్టపడి కొనుకున్న ఫోన్ పోయిందని ఓ వ్యక్తి తీవ్ర స్థాయిలో ఆవేశానికి లోనయ్యాడు. చోరీ చేసిన వ్యక్తిలానే కనిపించడంతో మరో వ్యక్తిని పట్టుకొని ఇష్టమెచ్చినట్టు కొట్టాడు. తీరా అతను చోరీ చేసింది కాదని తేలింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
బీజింగ్లోని రద్దీగా ఉన్న సబ్ వే లో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ను దుండగుడు చోరీ చేశాడు. అనంతరం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో వెంటనే తేరుకున్న ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి దుండగుడి కోసం వెతకసాగాడు. అదే మార్గంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని పట్టుకొని చోరీ చేసింది నువ్వే అంటూ ఇష్టమోచ్చినట్టు దాడికి దిగాడు. పోలీసులను పిలవండి..అంటూ సదరు వ్యక్తి ఎంత ప్రాధేయపడ్డా అతన్ని కింద కూర్చోపెట్టి, నా ఫోన్ నాకివ్వూ అంటూ అందరూ చూస్తుండగానే కొట్టాడు. ఫ్లీజ్ సహాయం చేయండి అంటూ అతను రోదిస్తున్నా, మొహంపై పిడుగుద్దులు గుద్దుతూ అరుపులతో హడలెత్తించాడు. అక్కడ చాలా మంది ఎదో విచిత్రం జరుగుతుందా అన్నట్టు చూశారే కానీ, ఒక్కరు కూడా పోలీసులను పిలవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఓ అమాయకున్ని పట్టుకుని అంతదారుణంగా కొడతారా అంటూ..దాడికి దిగిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.