
పోకిరీలు చెయ్యేస్తే అంతే..
అమ్మాయిల దగ్గరికి వచ్చి టీజ్ చేసే పోకిరీల పని పట్టే ‘రోబో డ్రెస్’ ఇది. ఇష్టంలేని వ్యక్తులు దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి...
అమ్మాయిల దగ్గరికి వచ్చి టీజ్ చేసే పోకిరీల పని పట్టే ‘రోబో డ్రెస్’ ఇది. ఇష్టంలేని వ్యక్తులు దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి శ్వాస వేగంలో మార్పు, ఒత్తిడి స్థాయిలను పసిగట్టి వెంటనే యాక్టివేట్ కావడం దీని ప్రత్యేకత. ఓ ఎలక్ట్రానిక్ చిప్‌కు అనుసంధానమై ఉండే వైర్‌లెస్ బయో సెన్సర్లతో అమ్మాయిలో ఆందోళనను, ప్రాక్సిమిటీ సెన్సర్లతో పోకిరీలు ఎంత దూరంలో ఉన్నారన్న విషయాలను ఇది తెలుసుకుంటుంది.
ఇంకేం.. ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి ఆందోళనకు గురికాగానే.. పొడవాటి, పదునైన ముళ్లలాంటి కాళ్లను చాపుతుందన్నమాట. సాలీడు కన్నుల మాదిరిగా ఉండే నల్లటి ఎల్‌ఈడీ బల్బులు కాంతులు వెదజల్లి తొలుత హెచ్చరిస్తాయి కూడా.
నెదర్లాండ్స్‌కు చెందిన అనౌక్ విప్‌రెచ్ అనే లేడీ డిజైనర్ రూపొందించిన ఈ డ్రెస్‌ను అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇటీవల జరిగిన సెస్-2015 ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. అన్నట్టూ.. పోకిరీలు చెయ్యేస్తే షాక్ కొట్టే డ్రెస్‌ను, మూడ్‌ను బట్టి పారదర్శకంగా మారిపోయే డ్రెస్‌ను కూడా ఇంతకుముందు విప్‌రెచ్ రూపొందించారు.