లేహ్: సరిహద్దును చైనా మరోసారి అతిక్రమించింది. చైనా జవాన్లు ఇటీవల రెండు దఫాలుగా లడఖ్‌లోని ఎగువ ప్రాతం పాన్‌గాంగ్ సరస్సు వద్ద భారత జలాల్లోకి చొచ్చుకువచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే ప్రాంతంలోని భూ మార్గంలో 5 కి.మీ మేర భారత్ భూభాగంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నాయి. చైనా దళాలు రెండు పడవల్లో అక్టోబర్ 22వ తేదీన చొరబడినట్లు వెల్లడించాయి. వారి కదలికలను గుర్తించి అప్రమత్తమైన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు వాస్తవాధీన రేఖ వద్ద అడ్డుకున్నట్లు వెల్లడించాయి. కొండ ప్రాంతంలో కూడా చైనా దళాలను భారత బలగాలు నిరోధించాయి. దీంతో చైనా బలగాలు వెనుతిరిగాయి.
రెండు ప్రాంతాల నుంచి ఒకేసారి చొరబడటం ద్వారా భారత్ బలగాలపై మానసికంగా ఒత్తిడి పెంచాలని చైనా సైన్యం ఎత్తుగడ వేసినట్లు భావిస్తున్నారు. చైనా గస్తీ దళాలు తరచూ ఈ సరస్సు వద్ద పహరా కాస్తున్నాయి.