పుతిన్.. మీరు ఇంత పని చేస్తారా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటే చైనాలో ఇప్పుడు చాలామంది మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ భార్య చలికి వణికిపోతుంటే.. పుతిన్ చొరవగా ముందుకెళ్లి దగ్గరుండి ఆమెకు శాలువా కప్పి, అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కబుర్లు చెబుతూ ఉన్నారు. అంతే.. చైనాలో ఒక్కసారిగా దీనిమీద జోకులు మొదలైపోయాయి. ఇటీవలే విడాకులు తీసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటే చైనాలో చాలామంది మహిళలకు ఆరాధనా భావం ఉంది. దాంతో తాజా సంఘటన పట్ల చైనా ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తొలుత ఆన్లైన్లో వచ్చింది గానీ, ఆ తర్వాత చైనా ఇంటర్నెట్ నుంచి దాన్ని తీసేశారు. చైనా అధ్యక్షుడి భార్య పెంగ్ లియువాన్ అక్కడ ప్రముఖ జానపద గాయని. ఆమెకు భర్త కంటే ఎక్కువ ప్రజాదరణ కూడా ఉంది. ఇంతకుముందు అధ్యక్షుల భార్యల కంటే ఈమె ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంటారు. విదేశీ పర్యటనల్లో కూడా ఆమెకు ఆకర్షణ బాగుంటుంది.
అయితే.. రష్యాలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. అక్కడ బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు గౌరవం ఇవ్వడం పురుషులకు సర్వసాధారణం. మహిళలకు సాయం చేయడానికి అవసరమైతే తమ కోట్లను తీసి ఇవ్వడం కూడా మామూలేనని చెబుతున్నారు. చైనా వాళ్లకు మాత్రం ఇలాంటి అలవాట్లు లేకపోవడం వల్లే ఇలా అపార్థం చేసుకుని ఉంటారంటున్నారు.