కిమ్ జోంగ్‌పై జోకులకు చెల్లుచీటీ
కిమ్ జోంగ్‌పై జోకులకు చెల్లుచీటీ
Published Wed, Nov 16 2016 6:01 PM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మీద ఇప్పటివరకు సోషల్ మీడియాలలో చాలా జోకులు పేలుతున్నాయి. కానీ, ఇక మీదట చైనాలో మాత్రం అలాంటి జోకుకు చెల్లుచీటీ పలికారు. 'కిమ్ ఫాటీ ద థర్డ్' లాంటి పదాలను చైనా వెబ్‌సైట్లు సెన్సార్ చేస్తున్నాయి. ఇలాంటి పదాలు విపరీతంగా వాడుతున్నారంటూ ఉత్తరకొరియా అధికారులు చైనా అధికారులతో జరిగిన సమావేశంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. దాంతో చైనా వెంటనే వాటిని నిరోధించే చర్యలు మొదలుపెట్టింది. 'జిన్ సాన్ పాంగ్' లాంటి పదాలను చైనా సెర్చింజన్ బైదులో వెతికినా, మైక్రో బ్లాగింగ్ సైట్ వైబోలో వెతికినా ఎలాంటి ఫలితాలు చూపించడం లేదు.
కిమ్ వంశంలో మూడోతరానికి చెందిన కిమ్ జోంగ్ ఉన్ కాస్తంత లావుగా ఉండటంతో పాటు.. ఆయన నిరంకుశ విధానాల కారణంగా ప్రపంచం నలుమూలలా ఆయన చర్చనీయాంశంగా మారారు. ప్రపంచం మొత్తమ్మీద కమ్యూనిస్టులలో కూడా వారసత్వ పాలన ఉన్న ఏకైక దేశం ఉత్తర కొరియా మాత్రమే. దాంతో చైనా యువతీ యువకులు ఉత్తర కొరియా గురించి, ఆ దేశ పాలకుడి గురించి ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వెతుకుతుంటారు.
వాస్తవానికి అణ్వస్త్రాలను పరీక్షించిన తర్వాత ఉత్తరకొరియాపై చైనా కూడా మండిపడింది. కానీ, కొద్దిపాటి వాణిజ్యంతో పాటు దౌత్య సంబంధాలు కూడా ఉండటంతో మళ్లీ కిమ్ పాలనకు చైనా మద్దతు పలుకుతోంది. దాంతో.. తమ దేశాధ్యక్షుడికి ఇలాంటి నిక్ నేమ్‌లు ఉన్నాయని తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో కొరియా అధికారులు ఆ విషయాన్ని వెంటనే చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చైనా కూడా దీనిపై స్పందించింది. ఈ నిక్ నేమ్‌లు ఏవీ వాస్తవాలకు దగ్గరగా ఉండబోవని, అందువల్ల వాటిని నిషేధిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. కిమ ఫాటీ ద థర్డ్ అనే పదాన్ని చైనాలో ఇంతకుముందు విస్తృతంగా ఉపయోగించేవారు. ఇక మీదట ఇప్పుడు అలాంటివేవీ కనిపించవన్నమాట.
Advertisement
Advertisement