
బీజింగ్: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా చైనా నుంచి భారత్‌కు 6.5లక్షల మెడికల్ కిట్లు, వైద్య సామగ్రి గురువారం ఉదయం బయలుదేరిందని బీజింగ్‌లోని భారత రాయభారి విక్రమ్ మిశ్రి పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో మరో 20 లక్షల వైద్యసామగ్రి భారత్‌కు చేరుకోనుందని తెలిపారు. రాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లు, ఆర్ఎన్ఏ టెస్టింగ్ కిట్లు గ్వాన్‌గ్జూ విమానాశ్రయం నుంచి భారత్‌కు బయలుదేరాయని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కరోనాపై రెండు నెలల యుద్దం అనంతరం చైనాలోని ఫ్యాక్టరీలు తిరిగి తమ విధులను ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులతో కరోనా వైద్యసామగ్రికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో వాటిని తయారు చేస్తూ ఎగుమతులపై చైనా దృష్టి సారించింది. ముఖ్యంగా వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాల కోసం వివిధ దేశాల నుంచి ఆర్డర్లు ఎక్కువగా చైనాకు వస్తున్నాయి.
భారత దేశంలో ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో హాట్ స్పాట్లలో ప్రత్యేకంగా పరీక్షలను వేగవంతం చేయడానికి చైనా నుంచి దిగుమతి చేసుకున్న వైద్యసామగ్రి ఉపయోగపడనుంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైద్య సామాగ్రికి ఉన్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, సకాలంలో భారతదేశానికి రావడానికి విమాన అనుసంధానాలను సమన్వయం చేయడంతో పాటు వాణిజ్య సేకరణలను భారత రాయభార కార్యాలయం సులభతరం చేస్తోందని విక్రమ్ మిశ్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment