
గడుగ్గాయి.. ఈసారి కత్తితో!
వీడి వయసుకు, సైజుకు, చేష్టలకు అసలు పొంతనే లేదు. నాలుగేళ్ల పిల్లాడు ఎక్కడైనా రౌడీయిజానికి దిగుతాడా? కానీ ఈ చైనా గడుగ్గాయి మాత్రం నిండా ఐదేళ్లు నిండకముందే కర్రలు, కత్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వీధిలో అక్రమంగా దుకాణం ఉందంటూ తన బామ్మ దుకాణం తొలగిస్తున్న పోలీసులపై చైనాకు చెందిన నాలుగేళ్ల పిల్లాడు ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో గుర్తుందా? పోలీసులనే బెదిరిస్తూ.. తన బామ్మ జోలికి రావద్దంటూ వారికి ఎదురుతిరిగిన వీడియో గతఏడాది ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసింది. ఎంత గడుగ్గాయోనంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు అదే పిల్లాడు మరోసారి బెదిరింపులకు పాల్పడిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఐదేళ్ల క్సియో పాంగ్ తన బామ్మ దుకాణం వద్ద ఉండగా.. దుకాణం ముందు ఓ ట్రాలీ వచ్చి ఆగింది. అంతే దుకాణం ముందు ట్రాలీ పెట్టి గిరాకీ రాకుండా చేస్తున్నావని క్సియో ట్రాలీ డ్రైవర్‌పై రంకెలేశాడు. పండ్లు కోసే కత్తితో డ్రైవర్‌ను ‘నువ్వు పార్కింగ్ ఇక్కడ చేయకూడదు. పార్క్ చేస్తే కొడతా’ అంటూ బెదిరించడమే కాదు.. టైర్ పంక్చర్ కూడా చేయబోయాడు. పంక్చర్ చేస్తే ట్రాలీ వెనక్కి వెళ్లదనుకున్నాడో ఏమో.. ఆ పని చేయకుండా ట్రాలీ తీసేవరకు కత్తి పట్టుకొని అక్కడే నిల్చున్నాడు.