నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు గుప్పిస్తున్న ఓ విత్తనాల వ్యాపారి.. భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. తన సీడ్ దుకాణంలో అమ్మకాలు ఎక్కువగా జరిపేందుకు ఇష్టానుసారంగా వాడుతున్న పదాలు... చివరకు అతడి పీకలమీదకు తెచ్చిపెట్టాయి. మా విత్తనాలే అత్యుత్తమమైనవి అంటూ చేస్తున్న ప్రచారానికి వేలకొద్దీ డాలర్లు జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జెజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హాంగ్ ఝూ నగరంలో ఫాంగ్ అనే వ్యక్తి 'ఫాంగ్లిన్ ఫూ రోస్టెడ్ సీడ్స్' దుకాణం నిర్వహిస్తున్నాడు. వేయించిన విత్తనాల సంచులు, బిల్ బోర్డులపై ఉత్తమ, గొప్ప, అంటూ ప్రింట్ చేసి మరీ అమ్మకాలు జరపడంతో అతినికి సుమారు 30.360 డాలర్ల జరిమానా పడింది. తనకు స్థానిక మార్కెట్ పర్యవేక్షణ విభాగంనుంచీ గతవారం నోటీసులు అందాయని, ప్రకటనల చట్టాన్ని అతిక్రమించినందుకు ఫైన్ విధించినట్లు అందులో పేర్కొన్నారని షాపు యజమాని ఫాంగ్ చెప్తున్నాడు. హాంగ్షూ పేరుతో ఫాంగ్ మరో మూడు దుకాణాలతోపాటు, ఆన్లైన్ అమ్మకాలు కూడ నిర్వహిస్తున్నాడు. అయితే తాను దాదాపు ఇరవై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నానని, మంచి క్వాలిటీ ముడి పదార్థాలనే అమ్ముతున్నానని, అందుకు సరిపోయే మంచి పదాలనే తన ప్రచారానికి వాడుకుంటున్నానని చెప్తున్నాడు. అటువంటి పదాలు వాడటం చట్ట విరుద్ధమని తెలిస్తే తాను ఆపని చేసి ఉండేవాడిని కాదని లబోదిబోమంటున్నాడు.
అయితే నోటీసులు అందిన వెంటనే ఫాంగ్ తాను వాడిన పదాల్లో మార్పులను చేసినా ఉపయోగిం లేకపోయింది. రెండునెల్ల క్రితమే ఫాంగ్ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు తమకు నివేదిక అందిందని, ప్రాధమిక విచారణ అనంతరం అది నిజమేనని తేలిందని అధికారులు చెప్తున్నారు. అయితే ది బెస్ట్, గ్రేటెస్ట్ వంటి పదాలు మార్పు చేయడంలో ఫాంగ్ సహకారాన్ని పరిగణలోకి తీసుకొని అతనికి తక్కువ జరిమానా విధించేందుకు నిర్ణయించామని మార్కెట్ అధికారులు చెప్తున్నారు.
ప్రకటనలకు అతిశయోక్తి పదాల వాడకాన్ని చైనా బ్యాన్ చేసింది. కొత్త చట్టాన్ని అతిక్రమించినవారికి జరిమానా తప్పదని వెల్లడించింది. ఈ కొత్త చట్టం సెప్టెంబర్ నెల్లో అమల్లోకి కూడ వచ్చింది. ఆ తర్వాత కూడ ఫాంగ్ ప్రకటనల్లో మార్పులు చేయకపోవడంతో భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అయితే ఫాంగ్ ఖాతాదారులు కొంతమంది అతడికి జరిమానా విధించడం అన్యాయమంటున్నారు. నోటీసులు అందిన తర్వాత ఫాంగ్ పదాల్లో మార్పులు చేసినా అంత పెద్దమొత్తంలో జరిమానా కట్టాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు ప్రకటనల చట్టాల్లో వచ్చే మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హాంగ్ ఝూ టియాన్స్ లాయర్స్ ఫర్మ్ న్యాయవాది యో గ్జియోజువాన్ అంటున్నారు. అయితే ప్రభుత్వం కూడ పెద్ద మొత్తంలో జరిమానాలు విధించే ముందు... కొత్తగా చట్టాల్లో వచ్చిన మార్పులు, చేర్పులపై కొంత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
మంచి పదాలను వాడటమే అతని తప్పయింది...!
Published Thu, Jan 14 2016 10:54 PM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
Advertisement
Advertisement