పిట్స్బర్గ్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే చైనా అతిపెద్ద ఉత్తమ దుర్వినియోగురాలు అని ఆరోపించారు. అమెరికాలో తమ దేశానికి సంబంధించిన వస్తువులన్నింటిని కుమ్మరిస్తూ అమెరికా కంపెనీలో చైనాలో వ్యాపారం చేసేందుకు వెళితే భారీ మొత్తంలో పన్నులు విధిస్తోందని ఆయన మండిపడ్డారు. చైనాకు మెక్సికో చిరురూపం అని ఎద్దేవా చేశారు. పిట్స్ బర్గ్ లో ఆయన తన పార్టీ మద్దతుదారులు నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను స్వేచ్ఛా వ్యాపారాన్ని సమర్థిస్తానని, అయితే, అది అనుకూలంగా ఉండాలే తప్ప దోచుకునేలా ఉండకూడదని అన్నారు. అవతలి వ్యక్తి ఏమనుకున్నా సరే తాను మాత్రం ఉత్తమ ఒప్పందాలు చేసుకొని, ఉత్తమ వ్యాపారాలు చేస్తానని చెప్పారు. చైనా ఉక్కునంతా అమెరికా కుమ్మరించడం తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు. ఎందుకంటే చైనా అలా చేస్తూ తమ మేథోసంపత్తిని దోచుకుంటుందని ఆరోపించారు. వచ్చే నవంబర్ లో అమెరికా ప్రజలు సరైన ట్రిగ్గర్ (ఎన్నికల బటన్) నొక్కితే, ఎలాంటి తమాషా జరుగుతుందో చూస్తారని అన్నారు.
చైనాతో మంచి సంబంధాలు ఏర్పరుస్తానని, అమెరికాకు మేలును చేకూర్చే వాణిజ్యం చేస్తానని అన్నారు. చైనాకు ఒబామా అంటే గౌరవం లేదని, హిల్లరీని కూడా పెద్దగా పట్టించుకోదని, కానీ, తానంటో వారికి తెలుసని అన్నారు. వారితో ఉత్తమ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తానని చెప్పారు. గతంలో కూడా చైనా తమ దేశాన్ని ఆర్థికపరంగా రేప్ చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల చైనా కూడా ట్రంప్ ముఖ చిత్రంతో కూడిన టాయిలెట్ పేపర్లు తయారు చేసి విక్రయించిన విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'ట్రిగ్గర్ సరిగా నొక్కితే.. చైనా పని చెప్తా'
Published Sun, Jun 12 2016 8:42 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
Advertisement
Advertisement