పాక్ కు మద్దతు.. భారత్ కు నై!
బీజింగ్:
న్యూక్లియర్ సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ స్వభ్యత్వంపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న చైనా.. అదే సమయంలో మన పొరుగుదేశం పాకిస్థాన్ కు మద్దతు పలుకుతోంది. ఎన్ఎస్జీలో భారత్ స్వభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా.. అదే సమయంలో వ్యూహాత్మకంగా పాకిస్థాన్ కు స్వభ్యత్వం ఇవ్వాలన్న వాదనను తెరపైకి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యూక్లియర్ సరఫరా బృందం (ఎన్ఎస్జీ) లో తమ సభ్యత్వానికి తమ సన్నిహిత మిత్రదేశం చైనా మద్దతు తెలిపిందని పాక్ విదేశీ కార్యదర్శి ఎజాజ్ చౌదరీ తెలిపారు.
తాష్కెండ్ లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమైన పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఈ మేరకు హామీ లభించిందని ఆయన తెలిపారు. ఇందుకుగాను హుస్సేన్ చైనా అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. కాగా, చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై.. ఎన్ఎస్ జీ లో భారత స్వభ్యత్వానికి మద్దతు తెలుపాలని కోరారు. ఎన్ఎస్జీలో భారత్ స్వభ్యత్వంపై పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని మోదీ చైనాను కోరారు.