బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనా శుక్రవారం తొలిసారిగా తమ దేశంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. రెండు అనుమానిత కేసులు ఉన్నాయి. షాంఘైలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి, ఈశాన్య ప్రావిన్స్ జిలిన్‌లో లోకల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా మరో వ్యక్తికి వైరస్ సోకినట్లు భావిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా కరోనా లక్షణాలు బయటపడకుండా వైరస్ బారిన వారు క్రమంగా కోలుకుంటున్నారని.. శుక్రవారం నాటికి ఈ సంఖ్య 35 నుంచి 28కి పడిపోయినట్లు వెల్లడించింది.(33 చైనీస్ కంపెనీలకు అమెరికా షాక్!)
కాగా చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం విదితమే. మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా మొదలు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను పలు దేశాలు క్రమంగా సడలిస్తూ ఇప్పుడిప్పుడే తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఇక ఇంతటి భారీ సంక్షోభానికి మూల కారణమై, లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి పరోక్ష కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మాత్రం తమ దేశంలో ఇప్పటి వరకు 82,971 కేసులు మాత్రమే నమోదయ్యాయని, 4634 కరోనా మరణాలు సంభవించాయని చెబుతోంది. అయితే చైనా వెల్లడించిన ఈ గణాంకాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ కేసులు నమోదు అయ్యి ఉంటాయని ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. డ్రాగన్ దేశంలో ఇప్పటికే 6లక్షల 40 వేలకుపైగా కోవిడ్ కేసులు వెలుగుచూసి ఉంటాయని పేర్కొంది. (రోజుకు సగటున లక్షా యాభై వేల మరణాలు!)
Comments
Please login to add a commentAdd a comment