అమెరికాకు.. చైనా సరికొత్త సవాల్‌! | China Shows Their Mother of All Bombs Own Version | Sakshi
Sakshi News home page

అమెరికాకు.. చైనా సరికొత్త సవాల్‌!

Published Sat, Jan 5 2019 12:06 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

China Shows Their Mother of All Bombs Own Version - Sakshi

బాంబును ప్రయోగించిన దృశ్యాలు (కర్టెసీ : ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ వెబ్‌సైట్‌)

బీజింగ్‌ : అమెరికా ప్రయోగించిన ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ అనే బాంబుకు దీటుగా.. చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును రూపొందించినట్లు తెలుస్తోంది. హెచ్‌- 6కె అనే బాంబర్‌ సాయంతో దానికి పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ మేరకు... ‘చైనా అమ్ములపొదిలో ఉన్న అతి శక్తిమంతమైన బాంబు చేరింది. దీనికి మదర్‌ ఆఫ్‌ ఆల్‌బాంబ్స్‌ అని నామకరణం చేశారు. చైనా రక్షణ సంస్థ ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ రూపొందించిన ఈ బాంబును అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి అత్యధిక స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించవచ్చు’ అని ట్వీట్‌ చేసింది.  

కాగా మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌గా చైనా చెప్పుకొంటున్న ఈ బాంబును పరీక్షించిన వీడియోను.. ఆ దేశ రక్షణ సంస్థ నార్త్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ ) తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. తద్వారా తమ వద్ద కూడా అణు బాంబులకు ప్రత్యామ్నాయ, అత్యంత శక్తిమంతమైన బాంబులు ఉన్నాయని చైనా.. ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీచేసింది. హెచ్‌-6కె అనే బాంబర్‌ ద్వారా దీనిని ప్రయోగించినట్టు పేర్కొంది. ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. అమెరికా రూపొందించిన బాంబు కంటే తాము రూపొందించిన ఈ బాంబు అత్యంత చిన్నది, తేలికైనదని, దీనిని మోసుకువెళ్లేందుకు పెద్ద పెద్ద ఎయిర్‌క్రాఫ్టులు అక్కర్లేదని తెలిపారు.

ఇక అఫ్గనిస్తాన్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అమెరికా సైన్యం.. గతేడాది జీబీయూ-43/బి అనే బాంబును ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనికి ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ అనే పేరు పెట్టారు. ఈ క్రమంలో చైనా కూడా తమ కొత్త బాంబుకు అదే పేరు పెట్టి.. అగ్రరాజ్యానికి సవాల్‌ విసిరింది. కాగా రష్యా కూడా ఇటువంటి బాంబునే తయారు చేసి దానికి ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా నామకరణం చేసింది. అత్యంత పెద్దది, థర్మోబరిక్‌ అయిన ఈ బాంబు గ్యాస్‌ను ఉపయోగించుకుని... పెద్ద పెద్ద ఫైర్‌బాల్స్‌ను విసరడం ద్వారా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. అయితే చైనా రూపొందించిన బాంబు మాత్రం థర్మోబరిక్‌ బాంబు కాదని గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement