బుస కొడుతున్న డ్రాగన్
బలగాలను ఉపసంహరించుకుని, తప్పులు దిద్దుకోవాలని భారత్‌కు చైనా హెచ్చరిక
బీజింగ్: సిక్కిం సరిహద్దు వివాదంపై చైనా మాటలు శ్రుతిమించుతున్నాయి. భారత్ పంచశీల సూత్రాలను ఉల్లంఘిస్తోందని, తన బలగాలను ఉపసంహరించుకుని తప్పులు దిద్దుకోవాలని పొరుగు దేశం మరోసారి హెచ్చరించింది. ‘సిక్కిం సమీపంలో చైనా నిర్మిస్తున్న రోడ్డు వల్ల తమ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురువుతాయంటూ భారత్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. భారత చర్యలు ఐక్యరాజ్య సమితి ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయి. 1950లో చైనా, భారత్, మయన్మార్‌లు శాంతియుత సహజీవనం కోసం పంచశీల సూత్రాలను ఆమోదించడం తెలిసిందే.
అయితే భారత్ ఆశ్చర్యకరంగా వేరే దేశంలోకి చొరబడి అంతర్జాతీయ సంబంధాల మౌలిక నిబంధనలను తుంగలోకి తొక్కుతోంది. భారత సైనికులు మా భూభాగంలోకి చొరబడటం తీవ్రమైన విషయం’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెన్ సువాంగ్ బుధవారం ఆరోపించారు. భారత సైనికులు ఇంకా తమ భూభాగంలోనే ఉన్నారని చెప్పారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు భారత్ సాధ్యమైనంత త్వరగా తన బలగాలను వాపసు తీసుకుని ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థాయికి వచ్చేలా చూడాలన్నారు. ‘1890నాటి సైనో–బ్రిటిష్ ఒప్పందం.. సిక్కిం సరిహద్దు గింపోచీ పర్వతం నుంచి మొదలవుతోందని చెబుతోంది. మా రోడ్డు నిర్మాణం ఆ పర్వతానికి 2 కి.మీ అవతల సాగుతోంది. భారత్ ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ అని ఆరోపించారు.
భూటాన్‌తో వివాదం లేదు: డోకా లా ప్రాంతం ప్రాచీన కాలం నుంచి చైనా అధీనంలో ఉందని గెన్ పేర్కొన్నారు. సరిహ ద్దు విషయంలో ఒక అంగీకారం లేకున్నప్పటికీ డోకాలాపై భూటాన్‌తో తమకెలాంటి వివాదమూ లేదన్నారు. భారత ప్రధాని నెహ్రూ అప్పటి చైనా ప్రధాని ఎన్‌లైకి రాసిన లేఖలో భూటాన్‌ను చైనాలో అంతర్భాగంగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. అలాంటిదేమీ లేదని గెన్ అన్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో భారత్‌కు వెళ్లే తమ పౌరులకు ట్రావెల్ అలర్ట్ జారీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.