మళ్లీ బరితెగించిన చైనా మీడియా
బీజింగ్: చైనా మీడియా మరింత హద్దు మీరుతోంది. ఒక్క సిక్కింలోని డోక్లామ్‌లోనే కాకుండా ఇప్పుడు మరిన్ని ప్రాంతాల విషయంలో రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. డోక్లామ్ మాత్రమే కాకుండా నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలను కూడా భారత భూభాగంగా చైనా గుర్తించబోదంటూ రెచ్చగొట్టేలాగా కథనాలు వెలువరించింది.
చైనాలో గ్లోబల్ టైమ్స్ అనే మీడియా సంస్థ తన కథనంలో చైనా కేవలం డోక్లామ్ భూమినే కాకుండా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఇతర భూభాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని, వాటిని భారత భూభాగంగా గుర్తించబోదని పేర్కొంది. అంతేకాదు, తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు యుద్ధానికి కూడా వెనుకాడబోమంటూ మరోసారి రెచ్చగొట్టేలా కథనం వెలువరించింది. అంతేకాదు, సరిహద్దు నిర్మాణం విషయంలో చైనా మరింత కఠినంగా ఉండాలని, వేగంగా సైన్యాన్ని సరిహద్దు వద్ద మోహరించి తిప్పాలని, డోక్లామ్ వద్ద సరిహద్దు నిర్మాణం పూర్తి చేయాలంటూ పేర్కొంది.