తైపీ: చైనా యుద్ధ విమానాలు మరోసారి తైవాన్ గగనతలంలోకి దూసుకొచ్చాయి. చైనీస్ ఫైటర్ జెట్లు జే-10, జే-11 గురువారం ఉదయం తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన గస్తీ బలగాలు సమాచారాన్ని అధికారులకు చేరవేయగా.. రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో చైనా విమానాలు వెనక్కి వెళ్లాయి. ఈ మేరకు తైవాన్ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా గత పది రోజుల్లో చైనా ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లడం ఇది ఐదోసారి. ఈ నేపథ్యంలో చైనా- తైవాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ఇష్టపడని చైనా.. పదే పదే ఆ ప్రాంతంపై ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. (సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: చైనా)
ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా విమానం తైవాన్ గగనతలంలో ప్రవేశించగా.. అగ్రరాజ్యం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందంటూ వాగ్యుద్ధానికి దిగింది. అంతేగాక అమెరికా చర్య తమ సార్వభౌమత్వాన్ని సవాలు చేసిందని విరుచుకుపడింది. ఈ విషయంపై స్పందించిన తైవాన్.. అమెరికా సీ-40ఏ బోయింగ్ 737 (మిలిటరీ వర్షన్) తమ అనుమతి పొందిన తర్వాతే గగనతలంలో ప్రవేశించిందని డ్రాగన్‌కు కౌంటర్ ఇచ్చింది. అంతేగాకుండా సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా ఇకనైనా తన పంథా మార్చుకోవాలని హితవు పలికింది. ఇదిలా ఉండగా... భారత్- చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. డ్రాగన్‌పైకి రాముడు బాణం సంధించినట్లుగా ఉన్న ఫొటోను ప్రచురించిన తైవాన్ న్యూస్(స్థానిక మీడియా).. ‘‘మేం జయించాం. మేం వధిస్తాం’’అనే క్యాప్షన్‌ను జతచేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే విధంగా చైనా ఆధిపత్యంలో అణచివేతకు గురవుతున్న హాంకాంగ్ వాసులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తుండటం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment