
బీజింగ్: ప్రతి మనిషికీ ఒక కల ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో దారి వెతుక్కుంటారు. అయితే మన స్తోమతకు మించిన కలలు కంటే మాత్రం అవి ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయి. కానీ చైనాకు చెందిన ఓ రైతు మాత్రం తన తాహతుకు మించిన కలను సైతం నిజం చేసుకున్నాడు. ఇంతకీ విషయమేంటంటే... చైనాకు చెందిన జుయీ అనే రైతుకు జీవితంలో ఎలాగైనా ఓ విమానం కొనుక్కోవాలనే ఆశ ఉండేది. అయితే, ఏ దేశంలో అయినా రైతుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా. మహా అయితే కొంచెం ఖరీదైన కార్లు మాత్రమే కొనగలరు. ఇక విమానమంటే అసాధ్యమే.
దీనికి జుయీ సైతం అతీతుడు కాదు. అందుకే ఎలాగైనా తన కలను నిజం చేసుకోవాలనుకున్న జుయీ ఏకంగా విమాన ఆకారంలో ఓ నిర్మాణం చేపట్టాడు. ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని పోలి ఉండే నమూనా తయారు చేయించుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ నిర్మాణం దాదాపు తుదిదశకు చేరింది. దీనికోసం జుయీ ఇప్పటి వరకూ 2.6 మిలియన్ యువాన్లు (సుమారు రూ.2 కోట్లు) వెచ్చించాడు. 124 అడుగుల పొడవు, 118 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ విమానం గాలిలోకి ఎగరలేకపోయినా.. తన కల నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందని జుయీ చెబుతున్నాడు. నిర్మాణం పూర్తయ్యాక దీనిలో ఓ రెస్టారెంటును పెడతానని అంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment