
కండలతో తాతయ్య హల్ చల్
మనసుంటే చాలు.. వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఆ చైనా తాత. ఆరు పదులు దాటిన వయసులో కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. కండలు తిరిగిన గండరగండడిలా హల్‌చల్ చేస్తున్నాడు. లియాంగ్ షియాంగ్ (61) అనే ఈ తాతకు ఓ మనవడు కూడా ఉన్నాడు. అయినా ఇప్పటికీ తప్పనిసరిగా జిమ్‌కు వెళ్లి వర్కవుట్లు చేసి అందరికీ తన కండలు ప్రదర్శిస్తున్నాడు. అయితే కేవలం కండలను అందరికీ చూపించాలని మాత్రమే కాక.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డకార్ ర్యాలీ ఆఫ్ రోడ్ కారు రేసులో పాల్గొనేందుకు కూడా ఈయన ఈ కసరత్తులు చేస్తున్నారట. కొన్నాళ్ల పాటు రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేసిన లియాంగ్ ఆ తర్వాత సొంతంగా లైటింగ్ వ్యాపారం చేసుకున్నాడు. అందులో తగిన లాభాలు పొందిన తర్వాత విదేశాలకు సుదీర్ఘ యాత్రలు చేయడం మొదలుపెట్టాడు. కానీ వయసు కారణంగా తాను ముందు ఉన్నంత ఫిట్‌గా లేకపోతున్నానని ఆయన గుర్తించాడు.
దాంతో.. స్నేహితుల సలహా తీసుకుని, వర్కవుట్లు మొదలుపెట్టాడు. ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్తూ బాడీ షేప్ మార్చుకున్నాడు. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుని మంచి కండలు రప్పించుకున్నాడు. రోజుకు ఏడుసార్లు భోజనం చేస్తూ.. తనకు ఎంతో ఇష్టమైన మాంసం తినడం మానేశాడు. ఇంతకుముందు 2012లో ఒకసారి డకర్ ర్యాలీలో లియాంగ్, అతడి కొడుకు కలిసి పాల్గొన్నారు. ఈసారి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించడంతో మళ్లీ పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రేసు ముగిసిన తర్వాత తాను హెల్మెట్ తీయగానే మనవడు వచ్చి తనను కౌగలించుకోవాలని, ఆ క్షణాలను ఆస్వాదించాలని లియాంగ్ ఆశపడుతున్నాడు. ఆయన కండలు చూసి సోషల్ మీడియాలో పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఆయన పేరుమీద వైబోలో హ్యాష్‌ట్యాగ్ పెడితే 8 లక్షల వ్యూలు వచ్చాయి.