అమెరికాతోనూ పెట్టుకుంటున్న చైనా!
న్యూయార్క్: భారత్‌తో ఇప్పటికే కయ్యానికి కాలు దువ్విన చైనా మరోపక్క, అమెరికాతో కూడ అలాంటి చర్యకే దిగింది. ఏకంగా అమెరికా నిఘా విమానాన్ని అడ్డుకునే చర్యకు దిగింది. పూర్తిస్థాయిలో ఆయుధాలతో ఉన్న రెండు చైనా యుద్ధ విమానాలు అమెరికా నిఘా విమానానికి అత్యంత చేరువగా వెళ్లి దానిని అడ్డుకునే ప్రయత్నం చేశాయని అమెరికా అధికారులు చెప్పారు. తూర్పు చైనా సముద్రంపై ఎగురుతున్న తమ నేవీ నిఘా విమానం యూఎస్ ఈపీ-3కి చైనాకు చెందిన జే 10 రకానికి చెందిన విమానాలు అత్యంత సమీపంగా వచ్చాయని, దీంతో తమ విమానం మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
అయితే, ఆ సమయంలో చైనా యుద్ధ విమానంలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉన్నాయని, మరింత దగ్గరగా వచ్చి ఉంటే ఏదైనా ప్రమాదం జరిగి ఉండేదని పెంటగాన్ అధికారులు తెలిపారు. అయితే, ఇలా అప్పుడప్పుడు జరగడం సాధారణం అని, ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాదని చైనా ప్రతినిధులు తెలిపారు. అయితే, కేవలం 300 అడుగుల సమీపంలోకి చైనా విమానం రావడం తమను ఆలోచనలో పడేసినట్లు యూఎస్ అధికారులు తెలిపారు. గతంలో కూడా రెండుసార్లు చైనాకు చెందిన ఎస్‌యూ-30 యుద్ధ విమానాలు ఇలాగే తమ విమానం విషయంలో జోక్యం చేసుకున్నట్లు వారు చెబుతున్నారు.