
రెండున్నర దశాబ్ధాల అనంతరం కలుసుకున్న తండ్రీకొడుకులు
బీజింగ్ : చైనాలో ఓ వ్యక్తి తప్పిపోయిన తన కుమారుడి కోసం ఏకంగా 24 ఏళ్లు అన్వేషించిన అనంతరం అతడ్ని కలుసుకున్నాడు. 1994, ఆగస్ట్ 8న మూడేళ్ల కుమారుడ్ని కోల్పోయిన తండ్రి చైనా అంతటా 1,80,000 అదృశ్య ప్రకటనలు ఇచ్చిన అనంతరం ఇటీవల కొడుకును కలుసుకోగలిగాడు. రెండు దశాబ్ధాల పాటు కుమారుడి ఆచూకీ లభ్యం కాకున్నా నిరాశకు లోనవని లీ షుంజీ తన ప్రయత్నాలు కొనసాగించారు. 24 సంవత్సరాల అనంతరం ప్రస్తుతం 27 ఏళ్లున్న లి లీ పోలీసులు చేపట్టిన డీఎన్‌ఏ పరీక్షల అనంతరం శుక్రవారం తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులను కలుసుకున్నాడు.
స్ధానిక పోలీసులు నిర్వహిస్తున్న తప్పిపోయిన పిల్లల డీఎన్‌ఏ డేటాబేస్‌తో అతడిని గుర్తించినట్టు మెయిల్ ఆన్‌లైన్ పేర్కొంది. తల్లితండ్రుల నుంచి విడిపోయిన తర్వాత బాలుడిని చేరదీసిన ఓ జంట అతడిని వారికి అప్పగించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో వారే పెంచిపెద్దచేశారు. ఇక తన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో లి షుంజీ తన వ్యాపారం మానివేసి మరీ చిన్నారి కోసం వెతుకులాట చేపట్టారు. చైనా అంతటా తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ పెద్ద ఎత్తున ప్రకటనలతో గాలించారు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించి దాదాపు రెండున్నర దశాబ్ధాల అనంతరం కుమారుడ్ని కలుసుకోగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment