
చైనా శత్రుదుర్భేద్యం!
► దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ధీమా
► చైనా ఆర్మీ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆయుధాల ప్రదర్శన
బీజింగ్: చైనా శత్రుదుర్భేద్యమైన దేశమని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదివారం ధీమా వ్యక్తం చేశారు. తమపై యుద్ధానికి వచ్చే ప్రపంచంలోని ఏ దేశాన్నైనా ఓడించే సామర్థ్యం తమ ఆర్మీకి ఉందని అన్నారు. చైనా సైన్యం యుద్ధానికి సన్నద్ధంగా ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. 23 లక్షల మంది సైనికులను కలిగిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) ప్రపంచంలోనే అతిపెద్దది.
1927 ఆగస్టు 1న మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) పీఎల్‌ఏను స్థాపించింది. అప్పటి నుంచి పీఎల్‌ఏ చైనా ప్రభుత్వం కింద కాకుండా సీపీసీ ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. తాజాగా పీఎల్‌ఏ 90వ వార్షికోత్సవం సందర్భంగా మంగోలియాలోని ఝరిహెలో భారీ పరేడ్, ఆయుధాల ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనను జిన్‌పింగ్ తిలకించారు. 12 వేల దళాలు, 100కు పైగా యుద్ధ విమానాలు, 600 రకాల ఆయుధాలను ప్రదర్శించారు. వీటిలో సగం ఆయుధాలు కొత్తగా రూపొందించినవే. స్వల్ప, మధ్య, దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఐదు అణు, సంప్రదాయ క్షిపణులతోపాటు భారత సరిహద్దులో పరీక్షించారని చెబుతున్న కొత్త యుద్ధ ట్యాంకును కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు.
ఇంకా బలమైన ఆర్మీ అవసరం..
సీపీసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన జిన్‌పింగ్...సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘సీపీసీ నాయకత్వం ఇచ్చే ఆదేశాలను మీరు విధిగా పాటించాలి. పార్టీ ఏం చెబితే అది చేయాలి. మనపైకి వచ్చే శత్రువులందరినీ ఓడించగలమనే విశ్వా సం, సామర్థ్యం మన ఆర్మీకి ఉంది’ అని అన్నారు. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో చైనాకు మరింత బలమైన ఆర్మీ అవసరం ఉందనీ, పీఎల్‌ఏను ప్రపంచంలోనే ఉత్తమ ఆర్మీగా మలచాలని పేర్కొన్నారు.
భారత్ సరిహద్దులోని డోక్లామ్ లో ఉద్రిక్తత గురించి మాత్రం ప్రస్తావించలేదు. అయితే చైనా భూభాగంలోకి భారత దళా లు చొచ్చుకువచ్చాయని చైనా విదేశాంగ, రక్షణ శాఖలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్ పైవ్యాఖ్యలు చేశారు. కాగా, జిన్‌పింగ్ ప్రదర్శనకు హాజరవడానికి కొద్దిసేపటి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ మాట్లాడుతూ ఉత్తర కొరియాను నిలువరించడంలో చైనా విఫలమైందన్నారు. అమెరికా మొత్తంలో ఎక్కడైనా ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించడం తెలిసిందే.
క్షిపణి నిరోధకాన్ని పరీక్షించిన అమెరికా
ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష జరిపిన మరుసటి రోజే క్షిపణులను అడ్డుకోగల వ్యవస్థను అమెరికా విజయవంతంగా పరీక్షించింది. దీనిని కొరియా ద్వీపకల్పంలో మోహరించే అవకాశం ఉంది. పరీక్షలో భాగంగా అమెరికా ‘ఎయిర్‌ఫోర్స్ సీ–17’ నుంచి ఓ మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించగా, దీనిని అలస్కాలోని థాడ్ (టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) క్షిపణి నిరోధక వ్యవస్థ గుర్తించి నాశనం చేసింది. థాడ్‌ను తమ ప్రాంతంలో ఏర్పాటుచేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని దక్షిణ కొరియా తెలిపింది.