బీజింగ్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) జన్యు పునఃసంయోగాల(జీన్ రీకాంబినేషన్) వల్లే పుట్టిందని చైనీయుల ఆధ్వర్యంలోని పరిశోధకుల సమూహం తాజాగా వెల్లడించింది. కరోనా.. ల్యాబ్‌లో సృష్టించిన వైరస్ కాదని.. ప్రకృతిలోని జీవుల నుంచే సహజంగా వ్యాప్తి చెందిందని తెలిపింది. గబ్బిలాలపై గత కొన్ని రోజులుగా తాము నిర్వహిస్తున్న ప్రయోగాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొంది. నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ నుంచి సేకరించిన దాదాపు 227 శాంపిళ్ల(గబ్బిలాలు)ను విశ్లేషించినట్లు పరిశోధకులు తెలిపారు. గబ్బిలాల్లోని ఆర్‌ఎమ్‌వైఎన్‌ఓ2 జన్యుక్రమం, హెచ్‌సీఓవీ-19(కోవిడ్-19) జన్యుక్రమంతో దాదాపు 93 శాతం సరిపోలిందని వెల్లడించారు. ప్రకృతిలో సహజంగా జరిగే రీకాంబినేషన్లకు ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.(కరోనా వైరస్‌తో మృతులు లక్షల్లో ఉండొచ్చు)
ఇక కరోనా వ్యాప్తి గురించి వుహాన్ యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్ చాంగ్ జాంక్వీ మాట్లాడుతూ... ‘‘ఒకే జీవిలో ఉండే వివిధ వైరస్‌ల పునఃసంయోగాల వల్ల ఇలాంటి కొత్త వైరస్‌లు పుట్టుకొస్తాయి’’అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. కాగా చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు పోగొట్టుకోగా.. లక్షలాది మంది కరోనా భయంతో విలవిల్లాడుతున్నారు. భారత్‌లోనూ నలభైకి పైగా కరోనా కేసులు బయటపడిన విషయం తెలిసిందే. ఇక కరోనా సహజంగా పుట్టిన వైరస్ కాదని.. బయోవార్ కోసం మానవులే దానిని సృష్టించారంటూ వదంతులు వ్యాపించిన నేపథ్యంలో పరిశోధకుల తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.(మరో కేసు నమోదు.. మూడేళ్ల చిన్నారికి కరోనా)
Comments
Please login to add a commentAdd a comment