‘కరోనా’ కల్లోలం : ప్రపంచానికి సూటి ప్రశ్న! | Chinese Woman Urges Dont Spread Hate On Wuhan Over Coronavirus | Sakshi
Sakshi News home page

ఓ చైనా మహిళ ఆవేదన : ప్రపంచానికి సూటి ప్రశ్న!

Published Tue, Feb 11 2020 2:17 PM | Last Updated on Wed, Feb 12 2020 8:27 AM

Chinese Woman Urges Dont Spread On Wuhan Over Corona virus - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో వ్యాపించిన ఆ మహమ్మారి ఎక్కడ తమకు అంటుకుపోతుందో అని ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే వందలాది మంది మృతిచెందడం, వేల సంఖ్యలో కరోనా అనుమానితులు బయటపడటంతో.. దీనికంతటికీ చైనీయుల ఆహారపు అలవాట్లే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. గబ్బిలాల పులుసు, పాముల వేపుడు, పచ్చి ఎలుకలు తింటే ఇలాంటి వైరస్‌లు వ్యాప్తి చెందడం సహజమే కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ మూలాలు తొలి సారిగా బయటపడ్డ వుహాన్‌ పట్టణం గురించి ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. అయితే, చైనాలో ప్రస్తుత పరిస్థితిపై ఆ దేశానికి చెందిన ఒక మహిళ ఆవేదన ఏమిటో ఒకసారి గమనిద్దాం. ప్రపంచ దేశాలకు ఆమె ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

చైనీయులకూ మనసు ఉంటుందని.. వారు కావాలని ఎవరికీ ఎటువంటి వ్యాధి అంటగట్టలేదని, కేవలం కరోనా మాత్రమే తమ గుర్తింపు కాదని... వుహాన్‌కు ఉన్న మరో పార్శ్వాన్ని చూడమని అంటున్నారు డెబ్బీ లూ. చైనాకు చెందిన ప్రవాసురాలు ఆమె. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న డెబ్బీ లూ, అందరిలాగే తమకు కూడా కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, వాటిని గౌరవించాలని విఙ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఇతర దేశాలకు మద్దతుగా నిలిచే ప్రపంచ దేశాలు చైనా విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనీయుల జీవనశైలిపై సోషల్‌ మీడియాలో అధిక సంఖ్యలో మీమ్స్‌, ఫొటోలు షేర్‌ అవుతున్న క్రమంలో.. ‘‘దయచేసి, వుహాన్‌ను నిందించవద్దు. వుహాన్‌ కోసం ప్రార్థిస్తే తప్పేం ఉంది’’ అంటూ ఆమె పంచుకున్న మనో వేదనకు అక్షర రూపమే ఈ కథనం.(కరోనాతో కకావికలం..908కి చేరిన మృతుల సంఖ్య

చదవండి :  (కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే?)

దెయ్యాల నగరంగా మారింది..
‘‘నిజానికి వుహాన్‌ పట్టణం ఎల్లప్పుడూ ఎంతో సందడిగా.. బిజీబిజీగా ఉండేది. 14 మిలియన్‌ మంది ప్రజలు ఇక్కడ నివసిస్తారు. కానీ ఇప్పుడు అదో దెయ్యాల నగరంగా మారింది. సాధారణంగా.. రోజూ  పొద్దున పార్కులో వ్యాయామం చేస్తున్నవారిని కిటికీలో నుంచి చూసేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎవరూ వాకింగ్‌కు వెళ్లడం లేదు. కార్లు లేవు. బస్సులు లేవు. నగరమంతా చీకటిగా అనిపిస్తుంది. నేనే కాదు.. నాలాగే ఎంతోమంది ఇలాగే నిస్సహాయులుగా మిగిలిపోయారనుకుంటా. నాకు తెలిసి మమ్మల్ని ఎవరైనా ట్రాప్‌ చేశారేమో అనిపిస్తోంది.

జనవరి 23న పది గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) నగరం మొత్తం మూగబోయింది. బస్సులు లేవు.. టాక్సీలు లేవు. మాస్కులు ధరించిన పారా మిలిటరీ పోలీసులు రవాణా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. బ్రిడ్జిలన్నింటినీ మూసివేశారు. రహదారులను సీజ్‌ చేశారు. విమానాలన్నీ నేలమీదే ఉన్నాయి. షిప్పులు కదిలే పరిస్థితే లేదు. నా రోజులన్నీ ఇంట్లోనే గడిపేశాను. పొద్దున్నే యోగా మ్యాట్‌పై కూర్చుని వ్యాయామం చేసేదాన్ని. ల్యాప్‌టాప్‌ ముందేసుకుని యాంత్రికంగా పనిచేసుకునే దాన్ని. అమ్మానాన్నాలతో కలిసి టీవీ చూస్తూ భోజనం చేసేదాన్ని. హుబే ప్రావిన్స్‌ మొత్తం స్తంభించిపోయింది. ఎవరూ వుహాన్‌ను వదిలి వెళ్లడానికి వీల్లేదు. 

చదవండి: ఆకలితో చావాల్సి వస్తుంది, అందుకే ఇలా..!

ఆరేళ్లుగా అక్కడే ఉంటున్నా.. 
నేను గత ఆరేళ్లుగా టొరంటోలో నివసిస్తున్నాను. కెనడాలో పదేళ్లపాటు నివాసం ఉన్నాను. అక్కడే ఒట్టావాలోని కార్లెటాన్‌ యూనివర్సిటీలో చదువుకున్నాను. ప్రస్తుతం అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకుని ఉద్యోగం చేస్తున్నాను. షెంజన్‌లో ఉన్న క్లయింట్స్‌ను కలిసేందుకు.. పనిలో పనిగా మా కుటుంబంతో కలిసి చైనీస్‌ న్యూ ఇయర్‌ జరుపుకొనేందుకు జవనరి 10న టొరంటో నుంచి బయల్దేరాను. సాధారణంగా ఏడాదికొకసారి మాత్రమే నేను అక్కడికి వెళ్తుంటా.

గతంలో అయితే.... మా అత్తలు, మామలు, పిన్నీ-బాబాయ్‌లు, కజిన్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల పిల్లలతో సరదాగా వేడుక చేసుకునే వాళ్లం. దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ ఎంజాయ్‌ చేసేవాళ్లం. వుహాన్‌లో ఉన్న మా బామ్మాతాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం. షాపింగ్‌ చేసేవాళ్లం. ప్లే కార్డ్స్‌, వీడియో గేమ్స్‌ ఆడుతూ.. సినిమాలు, టీవీ షోలు చూస్తూ సందడి చేసేవాళ్లం. కలిసి డంప్లింగ్స్‌(చైనీస్‌ వంటకం) వండేవాళ్లం. ఇదంతా ఎంతో సరదాగా ఉండేది. మా నవ్వులు, కేకలతో ఇళ్లంతా నిండిపోయేది. 

చదవండి: కరోనా: ఇది హృదయ విదారక ఘటన!

తాతయ్య తొలి వర్ధంతికి కలుద్దామని..
చైనీస్‌ న్యూఇయర్‌ కూడా క్రిస్‌మస్‌ పండుగ లాంటిదే. కుటుంబమంతా ఒక్కచోట చేరే రోజు. ఈ ఏడాది అలాంటి రోజుకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మా తాతయ్య చనిపోయిన ఏడాది తర్వాత తొలిసారిగా అందరం కలువబోతున్నాం. అంతా కలిసి ఆయన సమాధిని వద్దకు వెళ్లి నివాళలు అర్పించాలనుకున్నాం.

కానీ దురదృష్టవశాత్తూ.. అలా జరగలేదు. నా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటున్న సమయంలోనే తొలిసారిగా వైరస్‌ గురించి వార్తలు విన్నాను. అప్పటికి చైనీస్‌ వైద్యులు వైరస్‌ పేరును ఇంకా నిర్ధారించలేదు. ఈ విషయం గురించి మా అమ్మానాన్నలను అడిగాను. ఇది అంత సీరియస్‌ కాదేమో లే అని వాళ్లు చెప్పారు. పైగా మా నగరాన్ని రెండుగా విభజించే యాంగ్జ్‌ నది తీరాన ఈ వైరస్‌ వ్యాపించిందని.. వాళ్లు నివాసం ఉండేచోటుకు ఇది దాదాపు 20 కిలోమీటర్ల దూరం కాబట్టి.. సాధారణంగానే వాళ్లు వైరస్‌ గురించి మరీ అంతగా భయపడలేదు. 

చదవండి: అంతర్జాతీయ విద్యకు అతిపెద్ద దెబ్బ.. కరోనా!

జనవరి 20.. ఓ టర్నింగ్‌ పాయింట్‌. అప్పటికి నేను వుహాన్‌ చేరి మూడు రోజులు అవుతోంది. వైరస్‌ వ్యాప్తి గురించి అవగాహన కల్పించేందుకు.. అది సోకకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని.. చేతులో తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలని.. సమూహాలుగా బయటకు వెళ్లకూడదని వైద్యాధికారులు సూచనలు చేస్తున్న రోజు. అయితే అదే రోజు మాస్కులన్నీ అమ్ముడుపోయాయి. న్యూ ఇయర్‌ కోసం వుహాన్‌కు రావాల్సిన మా బంధువులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. 

చదవండి: ‘కరోనా’కు ఒక్క రోజులో వంద మంది మృతి

నాకు తెలిసిన.. నేను ప్రేమించే వుహాన్‌!
నేను పుట్టిపెరిగింది ఇక్కడే. నడక నేర్చుకున్నది ఇక్కడే. మా భాష నేర్చుకున్నాను. హువాజాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మా అమ్మానాన్నలు ప్రొఫెసర్లుగా పనిచేసేవారు. ఇప్పటికీ వాళ్లు ఇక్కడే నివసిస్తున్నారు. అన్ని మెట్రో పాలిటన్‌ నగరాల్లాగే వుహాన్‌ కూడా. అందరిలాగే ఇక్కడి జనాలు కూడా పనిచేసుకుంటూ.. హాయిగా భోజనం చేస్తూ.. పాటలు పాడుకుంటూ.. షాపింగ్‌ కోసం మాల్స్‌కు వెళ్తూ ఉంటారు.

ఇక్కడి ప్రదేశాలతో ​ఎన్నో నాకు సంబంధించిన ఎన్నో ఙ్ఞాపకాలు, భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. నాకింకా గుర్తు.. రోజూ నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేదాన్ని. వు చాంగ్‌ నుంచి హాన్‌ కో వెళ్లడానికి స్నేహితులతో కలిసి యాంగ్జీ నదిపై ఫెర్రీలో ప్రయాణం చేసేదాన్ని. అ​క్కడున్న నా ఫేవరెట్‌ బుక్‌స్టోర్లు, కాఫీ షాపులకు వెళ్లేదాన్ని. నా బాల్యంలో ఈస్ట్‌ లేక్‌ దాటి వెళ్లడం, స్నాక్స్‌ తెచ్చుకోవడం, పడవలు అద్దెకు తీసుకుని నడపటం, నదీ తీరం వెంబడి బైకింగ్‌ చేయడం సరదా ఙ్ఞాపకాలు.

చదవండి: భారతీయ శాస్త్రవేత్త కృషి..కరోనాకు వ్యాక్సిన్‌

నాకింకా గుర్తు...
వుహాన్‌ యూనివర్సిటీలో ప్రతీ వసంత కాలంలో వికసించే చెర్రీ మొగ్గలు నాకింకా గుర్తు. వుహాన్‌ ఙ్ఞప్తికి వచ్చిన ప్రతీసారి నా మనసు ప్రేమ పారవశ్యంలో మునిగిపోతుంది. నా సొంతపట్టణంలో.. ప్రజలంతా సానుకూల దృక్పథంతో ఉంటారు. డాక్టర్లు, నర్సులు ఆస్పత్రుల్లో పేషెంట్లకు హై ఫైవ్‌ ఇస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. చైనీస్‌ ప్రజల్లో చాలా మంది వైరస్‌ గురించి అనేక మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. వెకేషన్ల గురించి జోకులు వేసుకుంటున్నారు.. బెడ్‌రూం నుంచి కిచెన్‌ వరకే మా వెకేషన్‌. ఒక్కరు కూడా ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. చైనీస్‌ న్యూ ఇయర్‌ వేడుకల్లో సంప్రదాయబద్దమైన లయన్‌ డ్యాన్స్‌కు ప్రత్యేకస్థానం ఉంది. అయితే ఈసారి దానిని మేం సెలబ్రేట్‌ చేసుకోలేకపోవచ్చు. ఈ విషయం గురించి కూడా లివింగ్‌ రూంలో కూర్చుని చాలామంది ఫన్నీ వీడియోలు షేర్‌ చేస్తున్నారు.

చదవండి: కరోనా భయం: కూతురికి గాల్లోనే హగ్‌ ఇచ్చిన నర్సు..

కానీ చాలా మంది పాశ్చాత్య దేశస్థులు.. వుహాన్‌ను కరోనా వ్యాప్తి కోణంలో మాత్రమే చూస్తున్నారు. మా దగ్గర ఉన్న ప్రముఖ రచయితలు, మేధావులు, నటుల గురించి.. ఇక్కడి స్ట్రీట్‌ఫుడ్‌ గురించి, వేసవి కాలపు సాయంత్రాల గురించి వారికి ఏమాత్రం తెలియదు. మా దగ్గర ఉన్న ప్రముఖ పాఠశాలలు, విద్యావిధానం గురించి వాళ్లకు అస్సలు తెలియదు. కరోనా వైరస్‌ కారణంగా నా ఇంటి గురించి సోషల్‌ మీడియాలో ప్రతికూల ప్రచారం చేస్తూ.. వారి అభిప్రాయాలను విచ్చలవిడిగా షేర్‌ చేస్తున్నారు. అలాంటి వాళ్లకు ఓ విఙ్ఞప్తి.. కేవలం కరోనా గురించి కాకుండా నేను ప్రేమించే, నాకు నచ్చే వుహాన్‌కు ఉన్న మరో పార్శ్వాన్ని కూడా చూడాలి. నేను ఈ కోణాన్ని వాళ్లకు చూపించగలను.

పిల్లల్ని గెంటేస్తున్నారు..
టొరంటోపై నాకు ప్రేమ లేదు అనుకుంటే పొరబాటే. కెనడాలోని టొరంటోను నా ఇంటిగా భావిస్తాను. ఎందుకంటే అది బహుళజాతులు, సంస్కృతుల సంగమం. ఎవరినైనా అక్కున చేర్చుకుంటుంది. అక్కడ అప్పుడప్పుడూ జాతి వివక్ష ఎదుర్కొన్నాను. అయితే చాలా అరుదుగా అలాంటి అనుభవాలు ఎదురవుతాయి. బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద కొన్నిసార్లు అలా జరుగుతుంది. అయితే ప్రతీచోటా జాతి వివక్ష ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. ఇక ఇప్పుడు.. కొంతమంది కరోనా వైరస్‌ పేరు చెప్పి.. వారి చర్యలను, మాటలను సమర్థించుకుంటున్నారు. చైనా ప్రజలను దేశం నుంచి బహిష్కరించాలంటూ కొంతమంది మీమ్స్‌ సృష్టిస్తున్నారు. ఎన్నెన్నో ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. ఆసియా చిన్నారులను స్కూళ్ల నుంచి గెంటేస్తున్నారు. వైరస్‌ను వెంట తెచ్చారేమో అనే భయంతో దగ్గరికి కూడా రానివ్వడం లేదు. మార్ఖంలోని చైనీస్‌ రెస్టారెంట్ల యజమానులను తీవ్రంగా వేధిస్తున్నారు. ఒకవేళ గబ్బిలం సూప్‌ను వండితే.. ఆన్‌లైన్‌లో నెగటివ్‌ రివ్యూలు ఇస్తామంటూ బెదిరిస్తున్నారు. అసలు ఆ బాధ ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా?

చదవండి: కరోనా వైరస్‌ ‘హీరో’  కన్నుమూత

వుహాన్‌ కోసం ఎవరు ప్రార్థిస్తున్నారు?
కరోనా వైరస్‌ ప్రబలిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఎవరిని నిందించాలో తెలియక చైనా మీద అక్కసు వెళ్లగక్కుతున్నారు. చైనా ఇకనైనా గుణపాఠం నేర్చుకోవాలని... జంతువులను తిన్న కారణంగానే ఇలాంటి వైరస్‌లు వ్యాపిస్తున్నాయని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నెన్నో ప్రకృతి విపత్తులు సంభవించాయి. ఆస్ట్రేలియా అడవులకు మంటలు అంటుకున్నాయి... టర్కీలో భూకంపం వచ్చింది. ఆ దేశాలకు ప్రపంచమంతా సానుభూతి తెలిపింది. మద్దతు ప్రకటించింది. సహాయం చేసింది. కానీ వుహాన్‌ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఇక్కడ ఎంతో మంది అమాయకపు ప్రజలు మరణిస్తున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా మరణిస్తున్న వారికి లభిస్తున్న ఆదరాభిమానాలు మాకు కూడా లభించాలి. ఇప్పటికే వందలాది మంది కరోనా వల్ల చనిపోయారు. వేలాది మంది బాధను అనుభవిస్తున్నారు. దాదాపు 25 దేశాల్లో ఇది విస్తరించింది. మరి మనం వుహాన్‌ కోసం ఎందుకు ప్రార్థించకూడదు??’’(చదవండి: విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలు..)

(హఫింగ్టన్‌పోస్టు సౌజన్యంతో...)

కరోనా వైరస్‌: వరుస కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement