తక్కువ నిద్రపోతున్నారా.. అయితే మీకు..
వాషింగ్టన్: నిద్రకూ, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందనేది ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం. కావాల్సినంత నిద్ర పోయేవారికి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం తక్కువే. దీన్ని బలపరిచే మరో విషయాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఆరు గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్ర పోయేవారికి జలుబు వైరస్ త్వరగా వ్యాపిస్తుందని, ఫలితంగా వీరికి తొందరగా జలుబు సంక్రమిస్తుందని కనుగొన్నారు. ఏడుగంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్ర పోయేవారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారికి ఈ వ్యాధి త్వరగా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అన్నారు.
యూసీఎస్‌ఎఫ్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం జరిపారు. దీనిలో భాగంగా 2007-2011 వరకు 164 మందిపై వీరు పరిశోధన సాగించి ఈ విషయాలు వెల్లడించారు. నిద్రకు సంబంధించిన అలవాట్లకూ, అనారోగ్యానికి గురికావడానికి సంబంధం ఉంది. ఇతర కారణాలతో పోలిస్తే త్వరగా జలుబు సంక్రమించడానికి నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ నిద్ర పోవడం ఇతర దీర్ఘకాలిక అనారోగ్యానికి, వ్యాధులకు, అకాల మరణాలకు కూడా దారి తీస్తుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనానికి తగినంత నిద్ర అవసరమని అధ్యయనవేత్తలు సూచిస్తున్నారు.