రండి.. ఇస్లాం నేర్పిస్తా!
♦ డొనాల్డ్ ట్రంప్‌కు లండన్ మేయర్ సాదిక్ ఆహ్వానం
♦ సాదిక్ వ్యాఖ్యలను పట్టించుకోనన్న ట్రంప్
లండన్: లండన్ కొత్త మేయర్ సాదిక్ ఖాన్, అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మధ్య వాగ్యుద్ధం ముదురుతోంది. అమెరికాలో ముస్లింలకు వీసా నిరాకరించినా.. లండన్ కొత్త మేయర్ సాదిక్‌కు ఆహ్వానం ఉంటుందని ట్రంప్ అనడంతో వివాదం మొదలైంది. ఓ బ్రిటన్ టీవీ చానల్‌కు మంగళవారమిచ్చిన ఇంటర్వ్యూలో సాదిక్ మాట్లాడుతూ.. ‘ట్రంప్‌ను లండన్‌కు ఆహ్వానిస్తున్నాను. మా కుటుంబ సభ్యులు, మిత్రులు, చుట్టుపక్కలవారిని పరిచయం చేస్తా. ముస్లింలైనా లండన్ ప్రజలుగా, బ్రిటన్లుగా ఎలా సంతోషంగా ఉంటున్నామో వివరిస్తా.
ఆయనకు ఇస్లాం గురించి అర్థమయ్యేలా చెబితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది’అని తెలిపారు. అనవసరంగా మతాల గురించి మాట్లాడి.. వివిధ నాగరితకల మధ్య గొడవపెట్టాలనుకునే ఆలోచనను ట్రంప్ మానుకోవాలన్నారు. ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలు చేస్తున్న పనికీ.. ట్రంప్ ఆలోచనకు పెద్ద తేడాఏమీ లేదన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న విభజన విధానం చాలా ప్రమాదకరమైందని సాదిక్ అన్నారు.
ఐ డోంట్ కేర్: ట్రంప్
కాగా,సాదిక్ మర్యాదలేకుండా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు. అసలు సమస్యనే తను ప్రస్తావిస్తున్నానని అంతే తప్ప ముస్లిం వ్యతిరేకిని కాదన్నారు. ‘ఆయన మాటలను నేను పట్టించుకోను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఆయనకు సరిగా అర్థం కాలేదు. ఇస్లాం టైజం గురించి మాట్లాడినందుకు నా ముస్లిం మిత్రులు నన్ను ప్రశంసించారు’ అని అన్నారు. ఖాన్ తననెప్పుడూ కలవలేదని.. అసలు ఖాన్‌కు తన గురించి పూర్తిగా తెలియదన్నారు.