Sadiq Khan
-
లండన్ మేయర్‌గా మూడోసారి సాదిక్ ఖాన్
లండన్: పాక్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్(53) లండన్ మేయర్‌గా భారీ మెజారిటీతో వరుసగా మూడోసారి గెలుపొందారు. మొత్తం ఓట్లలో 43.8 శాతం అంటే 10,88,225 ఓట్లు సాదిక్ ఖాన్‌కు పడగా కన్జర్వేటివ్ పారీ్టకి చెందిన ప్రధాన ప్రత్యర్ధి సుసాన్ హిల్‌కు 8,11,518 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన ఢిల్లీలో జన్మించిన వ్యాపారవేత్త తరుణ్ గులాటి ఓట్ల వేటలో విఫలమయ్యారు. మేయర్ పదవికి మొత్తం 13 మంది పోటీ పడ్డారు. లండన్ మేయర్ 89 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు. 2000వ సంవత్సరంలో పదవి ఏర్పాటయ్యాక వరుసగా మూడు పర్యాయాలు మేయర్‌గా ఎన్నికైన నేతగా సాదిక్ ఖాన్ రికార్డు సృష్టించారు. నాలుగేళ్ల పదవీ కాలానికిగాను 2016, 2020 ఎన్నికల్లో ఆయన మేయర్‌గా ఎన్నికయ్యారు. -
మేయర్ అరెస్ట్‌కు డిమాండ్.. నవ్వులపాలు
లండన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇతర దేశాల్లోనూ అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ఇంగ్లాండ్‌లో ఆ సంఖ్యకు కొదవేం లేదు. అయితే తాజాగా లండన్‌లో ట్రంప్ వీరాభిమానులని చెప్పుకొనే కొందరు చేపట్టిన ఓ నిరసన ప్రదర్శన ఘోరంగా విఫలం అయ్యింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మేయర్ సాధిక్ ఖాన్ అరెస్ట్‌ను డిమాండ్ చేసి నవ్వులపాలయ్యారు. శనివారం సెంట్రల్ లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మేయర్ సాధిక్ ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రంప్ మద్ధతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేయటం ప్రారంభించారు. ఈయూకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓ వ్యక్తి అమెరికా జెండాను ప్రదర్శించాడు. నిరసనకు స్పష్టమైన కారణం వెల్లడించనప్పటికీ.. సాధిక్ ఖాన్‌కు మేయర్‌గా కొనసాగే అర్హత లేదని వారంతా సభలో గోల చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పరిణామాలతో మేయర్ ప్రసంగానికి కాసేపు ఆటంకం ఎదురైంది. 10 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బలవంతంగా బయటకు లాక్కెల్లారు. అనంతరం ప్రసంగించిన సాధిక్.. ‘‘మేధావుల మూలంగా స్పీచ్‌కు కాసేపు అంతరాయం కలిగిందని.. అందుకు ప్రజలు క్షమించాలి’’ అని పేర్కొనటంతో అక్కడ ఉన్న ప్రజలు గొల్లుమని నవ్వుకున్నారు. ఆపై తన ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు. అర్థం పర్థం లేని డిమాండ్‌తో పరువు తీసుకోవటం తప్పించి వారు సాధించింది ఏం లేదని కార్యక్రమం ముగిశాక కొందరు మీడియాతో వ్యాఖ్యానించారు. పాకిస్తానీ డ్రైవర్ కొడుకైన సాధిక్ ఖాన్ లండన్‌కు మెట్టమెదటి ముస్లిం మేయర్. ముస్లిం దేశాలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను.. విధిస్తున్న ఆంక్షలను.. నిర్ణయాలను సాధిక్ ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అభిమానులు ఇలా స్పందించారన్న మాట. -
తప్పే.. కానీ క్షమాపణ చెప్పం!
జలియన్‌వాలా బాగ్ మారణకాండ.. భారత స్వాతంత్య్ర చరిత్రలో అత్యంత భయంకరమైన పీడకల. ఈ మారణహోమానికి వందేళ్లు పూర్తికావస్తున్నా.. దానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోందే తప్ప.. ఆనాటి గాయాలను మాన్పేందుకు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్న ‘క్షమాపణ’ మాత్రం చెప్పడంలేదు. లండన్: జలియన్‌వాలా బాగ్ ఘటనకు బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందేనని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ మరోసారి డిమాండ్ చేశారు. 1919లో జరిగిన ఈ మారణహోమం బ్రిటిష్ చరిత్రకు మాయని మచ్చగా మిగిలిందన్నారు. వేలాదిమంది భారతీయుల కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చిన దుర్ఘటనకు త్వరలోనే వందేళ్లు పూర్తవుతున్న విషయాన్ని సాదిఖ్ గుర్తుచేశారు. భారతీయులకు క్షమాపణ చెప్పేందుకు ఇదే సరైన సమయమని సాదిఖ్ అభిప్రాయపడ్డారు. ఓ వాణిజ్య కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చిన ఆయన జలియన్‌వాలా బాగ్ ఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి, అమరులకు నివాళులర్పించారు. గతంలో కూడా.. : గతంలో కూడా బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు జలియన్‌వాలా బాగ్ ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణిస్తూ విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం తలదించుకునే ఘటనగా కూడా అభివర్ణించారు. అప్పటి డయ్యర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే క్షమాపణ చెప్పడాన్ని దాటవేశారు. 1997లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త, ప్రిన్స్ ఫిలిప్లు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. నాటి దురాగతానికి బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పేందుకు ఇదే సరైన సమయం. బాధితుల గాయాలకు బ్రిటిష్ ప్రభుత్వం చెప్పే క్షమాపణలే మందు. ఈ విషయమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నా వంతుగా కృషి చేస్తూనే ఉంటా’ – లండన్ మేయర్, సాదిక్ ఖాన్ -
లండన్ స్కూళ్లలో నైఫ్ డిటెక్టర్లు
లండన్: యువతను, విద్యార్థులను కత్తి పోటు దాడుల నుంచి కాపాడేందుకు లండన్ ప్రభుత్వం పక్కాగా ముందుకు సాగుతోంది. నగరంలోని అన్ని స్కూళ్లలో నైఫ్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ సాదిఖ్ ఖాన్ తెలిపారు. దీని సాయంతో ఆగంతకుల వద్ద ఉన్న కత్తుల వంటి మారణాయుధాలను సులువుగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో లండన్‌లో కత్తిపోటు ఘటనలు పెరిగిపోయాయి. ఈ వారం వ్యవధిలోనే క్యానింగ్ టౌన్, ఈస్ట్ హామ్, ఇస్లింగ్టన్ ప్రాంతాల్లో జరిగిన కత్తి పోట్లపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టి 518 కత్తులు, 11 పేలుడు పదార్థాలు, వివిధ రకాలైన 50 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 622 మంది అరెస్ట్ చేయగా ఇందులో 180 మంది వద్ద చాకులు లభించాయి. కత్తులతో దాడులకు పాల్పడే వారిని గుర్తించి అడ్డుకునేందుకు ‘నైఫ్ క్రైం స్ట్రాటజీ’ని ప్రకటించిన లండన్ మేయర్ దీనికోసం 8లక్షల పౌండ్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 2014-15 కాలంలో లండన్‌లో కత్తిపోటు ఘనటలు 5శాతం మేర పెరగ్గా 2016లో ఇది 11శాతానికి చేరుకుందని మేయర్ వివరించారు. -
రండి.. ఇస్లాం నేర్పిస్తా!
♦ డొనాల్డ్ ట్రంప్‌కు లండన్ మేయర్ సాదిక్ ఆహ్వానం ♦ సాదిక్ వ్యాఖ్యలను పట్టించుకోనన్న ట్రంప్ లండన్: లండన్ కొత్త మేయర్ సాదిక్ ఖాన్, అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మధ్య వాగ్యుద్ధం ముదురుతోంది. అమెరికాలో ముస్లింలకు వీసా నిరాకరించినా.. లండన్ కొత్త మేయర్ సాదిక్‌కు ఆహ్వానం ఉంటుందని ట్రంప్ అనడంతో వివాదం మొదలైంది. ఓ బ్రిటన్ టీవీ చానల్‌కు మంగళవారమిచ్చిన ఇంటర్వ్యూలో సాదిక్ మాట్లాడుతూ.. ‘ట్రంప్‌ను లండన్‌కు ఆహ్వానిస్తున్నాను. మా కుటుంబ సభ్యులు, మిత్రులు, చుట్టుపక్కలవారిని పరిచయం చేస్తా. ముస్లింలైనా లండన్ ప్రజలుగా, బ్రిటన్లుగా ఎలా సంతోషంగా ఉంటున్నామో వివరిస్తా. ఆయనకు ఇస్లాం గురించి అర్థమయ్యేలా చెబితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది’అని తెలిపారు. అనవసరంగా మతాల గురించి మాట్లాడి.. వివిధ నాగరితకల మధ్య గొడవపెట్టాలనుకునే ఆలోచనను ట్రంప్ మానుకోవాలన్నారు. ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలు చేస్తున్న పనికీ.. ట్రంప్ ఆలోచనకు పెద్ద తేడాఏమీ లేదన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న విభజన విధానం చాలా ప్రమాదకరమైందని సాదిక్ అన్నారు. ఐ డోంట్ కేర్: ట్రంప్ కాగా,సాదిక్ మర్యాదలేకుండా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు. అసలు సమస్యనే తను ప్రస్తావిస్తున్నానని అంతే తప్ప ముస్లిం వ్యతిరేకిని కాదన్నారు. ‘ఆయన మాటలను నేను పట్టించుకోను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఆయనకు సరిగా అర్థం కాలేదు. ఇస్లాం టైజం గురించి మాట్లాడినందుకు నా ముస్లిం మిత్రులు నన్ను ప్రశంసించారు’ అని అన్నారు. ఖాన్ తననెప్పుడూ కలవలేదని.. అసలు ఖాన్‌కు తన గురించి పూర్తిగా తెలియదన్నారు. -
లండన్ మేయర్‌గా ముస్లిం
లండన్: బ్రిటన్ రాజధాని లండన్ మేయర్‌గా తొలిసారి ఒక ముస్లిం వ్యక్తి ఎన్నికయ్యారు. ఈ మేరకు రికార్డు మెజారిటీతో గెలిచిన సాదిఖ్ ఖాన్ (45) అధికారికంగా సౌత్‌వార్క్ కేథడ్రల్‌లో జరిగిన కార్యక్రమంలో లండన్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ చెందిన బస్సు డ్రైవర్ కుమారుడు సాధిఖ్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున పోటీచేసి కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్‌స్మిత్‌పై 9 శాతం ఓట్లతో గెలుపొందారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత లండన్‌లో లేబర్ పార్టీ తన సత్తా చాటింది. లేబర్ పార్టీ తరఫున కెన్ లివింగ్స్టన్, కన్జర్వేటీవ్ తరఫున బోరిస్ జాన్సన్‌ల తర్వాత లండన్ మేయర్ పీఠాన్ని అధిష్టించిన మూడో వ్యక్తిగా సాధిఖ్ ఖాన్ రికార్డు సృష్టించారు. మేయర్‌గా ప్రమాణం తర్వాత సాధిఖ్ మాట్లాడుతూ.. ‘లండన్ ప్రపంచంలోనే అత్యున్నత నగరం. నాలాంటి వ్యక్తికి లండన్ మేయర్‌గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను’ అని పేర్కొన్నారు. -
బస్సు డ్రైవర్ కొడుకు మేయర్ అయ్యాడు!
లండన్: బ్రిటన్ రాజధాని లండన్ మేయర్ గా తొలిసారి ఓ ముస్లిం వ్యక్తి ఎన్నికయ్యారు. పాకిస్థాన్ కు చెందిన బస్సు డ్రైవర్ కొడుకు అయిన సాధిఖ్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున లండన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఈ చరిత్రాత్మక గెలుపుతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బ్రిటన్ రాజధానిపై లేబర్ పార్టీ తన జెండా ఎగురవేసింది. 'సూపర్ థార్స్ డే పోల్స్' పేరిట హోరాహోరీగా జరిగిన లండన్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ తరఫున సాధిఖ్ ఖాన్ బరిలోకి దిగారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోరులో తన ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్ స్మిత్ పై 9శాతం ఓట్ల ఆధిక్యంతో సాధిఖ్ విజయం సాధించారు. ఆయనకు పోలైన ఓట్లలో 46శాతం ఓట్లు దక్కాయి. ఈ క్రమంలో లండన్ సిటీ హాల్ లో తొలి ముస్లిం మేయర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రావాలంటే 50శాతం ఓట్లు సాధించాలి. కానీ,సాధిఖ్ ఆ మేరకు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కబెట్టారు. రెండో ప్రాధాన్యం ఓట్లలోను సాధిఖ్ దారిదాపుల్లో గోల్డ్ స్మిత్ రాలేకపోయారు. ఈ విజయంతో లండన్ మేయర్ పీఠంపై ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అధికార కన్జర్వేటివ్ పార్టీని కూలదోసి దానిని లేబర్ పార్టీ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ సంతతికి చెందిన ఖాన్ 2005లో టూటింగ్ ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ కేబినెట్ లో కీలక వ్యక్తిగా పనిచేశారు. ఆయనకు తీవ్రవాదులతో సంబంధాలు అంటగడుతూ ప్రత్యర్థి, దివంగత బిలియనీర్ సర్ జేమ్స్ గోల్డ్ స్మిత్ కొడుకు జాక్ చేసిన ప్రచారం తిప్పికొట్టింది. లండన్ లోని భిన్న మతాలు, సంస్కృతుల ప్రజలను విడగొట్టడానికి జాక్ ప్రయత్నిస్తున్నారని సాధిఖ్ ప్రచారంలో దూసుకెళ్లారు.