లండన్ స్కూళ్లలో నైఫ్ డిటెక్టర్లు
లండన్: యువతను, విద్యార్థులను కత్తి పోటు దాడుల నుంచి కాపాడేందుకు లండన్ ప్రభుత్వం పక్కాగా ముందుకు సాగుతోంది. నగరంలోని అన్ని స్కూళ్లలో నైఫ్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ సాదిఖ్ ఖాన్ తెలిపారు. దీని సాయంతో ఆగంతకుల వద్ద ఉన్న కత్తుల వంటి మారణాయుధాలను సులువుగా గుర్తించవచ్చని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో లండన్‌లో కత్తిపోటు ఘటనలు పెరిగిపోయాయి. ఈ వారం వ్యవధిలోనే క్యానింగ్ టౌన్, ఈస్ట్ హామ్, ఇస్లింగ్‌టన్ ప్రాంతాల్లో జరిగిన కత్తి పోట్లపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టి 518 కత్తులు, 11 పేలుడు పదార్థాలు, వివిధ రకాలైన 50 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 622 మంది అరెస్ట్ చేయగా ఇందులో 180 మంది వద్ద చాకులు లభించాయి.
కత్తులతో దాడులకు పాల్పడే వారిని గుర్తించి అడ్డుకునేందుకు ‘నైఫ్ క్రైం స్ట్రాటజీ’ని ప్రకటించిన లండన్ మేయర్ దీనికోసం 8లక్షల పౌండ్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 2014-15 కాలంలో లండన్‌లో కత్తిపోటు ఘనటలు 5శాతం మేర పెరగ్గా 2016లో ఇది 11శాతానికి చేరుకుందని మేయర్ వివరించారు.