తోకచుక్క నుంచి మద్యం ఉత్పత్తి!
న్యూయార్క్: ఆల్కహాల్ ఆంతరిక్షంలోనూ ఉత్పత్తవుతోందని ఫ్రాన్స్‌లోని ప్యారిస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లవ్‌జాయ్ అనే తోకచుక్క సెకెనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్‌ను అంతరిక్షంలోకి విడిచిపెడుతోందట. ఒక తోకచుక్కపై ఇథైల్ ఆల్కహాల్‌ను కనుగొనడం ఇదే మొదటిసారి. అతిశీతల వాతావరణం ఉండే లవ్‌జాయ్ ఈ ఏడాది జనవరి 30న సూర్యునికి దగ్గరగా వచ్చింది. సూర్యుని వేడిమికి ఇది సెకెనుకు 20 టన్నుల నీటి ఆవిరిని రోదసిలో విడుదల చేసింది. దీనిలో 500 బాటిళ్లకు సమానమైన ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో తోకచుక్కపై జీవం ఉనికికి అవసరమైన కర్బన పరమాణువులు ఉన్నట్లు తేలిందన్నారు.
ప్రకాశవంతమైన ఈ తోకచుక్కను స్పెయిన్‌ని నవేదా పర్వతాల్లో ఉన్న టెలిస్కోప్ ద్వారా పరిశీలించారు. భూమిలాంటి గ్రహం నుంచి విడివడిన పదార్థమే తోకచుక్కగా రూపాంతరం చెందిందని విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయనే వాదనకు మద్దతు లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.