మన సమాజంలో పెళ్లి అంటే ఏడడుగులతో.. వేదమంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. జీవితాంతం కలసి మెలసి తోడూనీడగా ఉండాలని కోరుకుంటారు. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకొంటారు. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లి కూడా కమర్షియల్ పుంతలు తొక్కుతోంది. అంటే అన్నీ రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి. అయితే వస్తువుల వరకు సరే కానీ.. పెళ్లి కొడుకు.. బంధువులు.. అందరూ అద్దెకు దొరికితే.. ఏంటీ పెళ్లి కొడుకును కూడా అద్దెకు తీసుకుంటారా అని ఆశ్చర్యపోకండి.
ఇదంతా నిజమే కానీ మన దగ్గర కాదులెండి.. వియత్నాంలో! ఇప్పుడు నకిలీ పెళ్లి అక్కడ పెద్ద వ్యాపారంగా వర్ధిల్లుతోంది. ఇలా ఎందుకు చేసుకుంటారంటే అక్కడి యువతులు పెళ్లి కాకముందే గర్భం దాల్చడం సర్వసాధారణం. అందుకే వారు అబార్షన్ చేసుకుంటారు. అలా వియత్నాంలో ఏటా 3 లక్షలకు పైగా అబార్షన్లు జరుగుతాయట. వాటిలో 20 నుంచి 30 శాతం అబార్షన్లు పెళ్లికాని వారే చేయించుకుంటారట. అయితే ఆ బిడ్డను చంపుకోవడం ఇష్టం లేని వారు మాత్రం అబార్షన్ చేయించుకోరు. ఇక్కడే ఉంది ట్విస్ట్. అలా పెళ్లి కాకముందు బిడ్డను కనడం మాత్రం సమాజం ఒప్పుకోదట.
దీంతో ఏదో ‘పెళ్లి జరిగింది’ అనిపించేందుకు ఓ పెళ్లి చేసుకుంటారట. నకిలీ పెళ్లి కొడుకులతో పాటు బంధువులు.. ఏర్పాట్లన్నీ సంబంధిత సంస్థలకు డబ్బులు ముట్టజెపితే చేసిపెడతాయి. అంతేకాదు భవిష్యత్తులో ఏవైనా చుట్టాల పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటే ఆ ‘భర్త’లను తిరిగి నియమించుకోవచ్చు. దీనివల్ల యువతులకు పెళ్లి అయిందనే ఒకరకమైన సంతృప్తి కలుగుతుందని వారి నమ్మకం.
Comments
Please login to add a commentAdd a comment