
ఇస్లామాబాద్ క్లబ్ భవనం (ఇన్‌సెట్‌లో భారత రాయబారి అజయ్ బిసారియా)
న్యూఢిల్లీ : దాయాది పాకిస్తాన్ మరోసారి తన వంకరబుద్ధిని బయటపెట్టుకుంది.భారత రాయబారి అజయ్ బిసారియాను ఉద్దేశపూర్వకంగా అవమానించింది.పలు దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండే ఇస్లామాబాద్ క్లబ్‌లో బిసారియా చేరకుండా అడ్డుకునేయత్నం చేసింది. సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో ముగిసే ప్రయను నెలలు గడుస్తున్నా వాయిదావేస్తూవచ్చింది. గతంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ ఇలా ఎప్పుడూ జరగలేదు. కొంతకాలంగా సరిహద్దులో వరుస కాల్పులు, ఉద్రక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ తాజా చర్య మరింత రెచ్చగొట్టినట్లైంది.
రాయబారుల అడ్డా ఇస్లామాబాద్ క్లబ్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రాయబార కార్యాలయాలకు సమీపంగా ఇస్లామాబాద్ క్లబ్ ఉంది. 350 ఎకరాల సువిశాల ప్రాగణంలో గోల్ఫ్, స్విమ్మింగ్, రెస్టారెంట్ సహా సకల సదుపాయాలుంటాయి. పాక్‌లో పనిచేసే అన్ని దేశాల రాయబారులు, వారి కుటుంబాలు, అత్యున్నతాధికారులకు అదొక రిక్రియేషన్ ప్లేస్. ఏ దేశం నుంచైనా కొత్తగా రాయబారి నియమితులయ్యారంటే, గంటల వ్యవధిలోనే ఆ క్లబ్‌లో మెంబర్ కావడం రివాజుగా వస్తోంది. అలా ఇస్లామాబాద్ క్లబ్ రాయబారుల అడ్డాగా పేరుపొందింది. కాగా, గత డిసెంబర్‌లో అజయ్ బిసారియా పాకిస్తాన్‌లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం ఇస్లామాబాద్ క్లబ్ మెంబర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ పాక్ అధికారులు ఆయనకు సభ్యత్వం ఇవ్వలేదు. భారత రాయబారుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న ఉద్దేశంలోనే పాక్ ఈ రీతిగా వ్యవహరిస్తున్నది.
మరి భారత్‌లో పాక్ రాయబారి సంగతేంటి? : వేర్పాటువాద నేతలతో వరుస భేటీలు నిర్వహించి వివాదాస్పదుడిగా పేరుపొందిన అబ్దుల్ బాసిత్ పదవీ విరమణ అనంతరం భారత్‌లో పాక్ రాయబారిగా సోహైల్ మొహమ్మద్(గతేడాది మేలో) నియమితులైన సంగతి తెలిసిందే. బాసిత్ అనుభవం దృష్ట్యా సోహైల్ కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రబుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఢిల్లీ శివారు నోయిడా, గురుగ్రామ్‌లలో పర్యటనకు ఆయనను అనుమతించడంలేదు. దీంతో పాకిస్తాన్‌కూడా అదే తరహా ఆంక్షలకు తెరలేపింది.
Comments
Please login to add a commentAdd a comment