కరోనా: చైనాలో డాక్టర్‌ అదృశ్యం, కలకలం | Corona Virus: Another Wuhan Doctor Missing | Sakshi
Sakshi News home page

కరోనా: హెచ్చరించిన మరో డాక్టర్‌ అదృశ్యం

Published Wed, Apr 1 2020 5:46 PM | Last Updated on Wed, Apr 1 2020 5:50 PM

Corona Virus: Another Wuhan Doctor Missing - Sakshi

బీజింగ్‌: ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ గురించి చైనాలోని ‘వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రి’ అధికారులను ముందుగానే హెచ్చరించిన వారిలో ఒకరైనా వుహాన్‌ డాక్టర్‌ ఐ ఫెన్‌ మంగళవారం నుంచి అదృశ్యమయ్యారు. పీపుల్స్‌ మేగజైన్‌లో ఆమె ఇంటర్వ్యూ ప్రచురితమైన  రోజునే ఆమె కనిపించకుండా పోవడంతో ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ వర్గాలే ఆమెను కిడ్నాప్‌ చేసి ఉంటాయని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్‌ బట్టబయలైందీ వుహాన్‌ మార్కెట్‌ నుంచే అన్న విషయం తెల్సిందే.

వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో డిసెంబర్‌ 30వ తేదీన ఓ రోగికి చెందిన మెడికల్‌ రిపోర్ట్‌ డాక్టర్‌ ఐ ఫెన్‌ దృష్టికి వచ్చింది. ‘సార్స్‌ లైక్‌ డిసీస్‌’ అనే లేబుల్‌ కలిగిన ఆ మెడికల్‌ రిపోర్ట్‌ను పరిశీలించిన ఆమె ట్విట్టర్‌లో తోటి వైద్యులను హెచ్చరించడంతోపాటు ఆ విషయాన్ని హాస్పటల్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దానికి ఉన్నతాధికారులు బాగా చీవాట్లు పెట్టారు. ఎందుకు ఆన్‌లైన్‌లో ప్రచారం చేశారంటూ ఆమెను తీవ్రంగా మందలించారు. ఆమె పోస్ట్‌ చేసిన మెడికల్‌ రిపోర్ట్‌ చూసి తక్షణం స్పందించిన డాక్టర్‌ లీ వెన్లీయాంగ్‌ సోషల్‌ మీడియా ద్వారా ఈ వైరస్‌ సార్స్‌కంటే భయానకమైందంటూ ప్రజలను హెచ్చరించారు. అందుకు ఆయన్ని కూడా ఆస్పత్రి ఉన్నతాధికారులు తీవ్రంగా మందలించారు. ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆస్పత్రి వైద్య సిబ్బంది ఇంచార్జిగా ఎంతోమంది కరోనా పీడితులకు చికిత్సచేసి చివరకు తనకు ఆ వైరస్‌ సోకి మరణించారు. ఆయనతోపాటు ప్రమాదకరమైన వైరస్‌ గురించి ముందుగా హెచ్చరించిన మరో ముగ్గురు డాక్టర్లు కూడా అదే వైరస్‌ బారిన పడి మరణించారు.

ఈ నలుగురి హెచ్చరికలను వుహాన్‌ సెంట్రల్‌ హాస్పటల్‌ ఉన్నతాధికారులు ముందుగానే పట్టించుకుంటే పరిస్థితి చేయిదాటి పోయేది కాదని ఆ తర్వాత తెల్సింది. పైగా చైనా అధికారులు ఆ వైరస్‌ అమెరికా సైనికుల నుంచి వచ్చి ఉంటుందంటూ దుష్ప్రచారం కూడా చేశారు. వైరస్‌ గురించి ముందుగానే హెచ్చరించిన నలుగురు వైద్యుల్లో జీవించి ఉన్న డాక్టర్‌ ఐ ఫెన్‌ను స్థానిక పీపుల్‌ మేగజైన్‌ ఇంటర్వ్యూ చేసింది. తాను ముందుగానే ఆస్పత్రి అధికారులను హెచ్చరించిన విషయం, అందుకు వారు తనను ఏవిధంగా మందలించారో ఆమె ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ ప్రచురితమైన మంగళవారం రోజు నుంచే ఆమె కనిపించకుండా పోయారు. ఆ ఇంటర్వ్యూ లింక్‌ ముందుగా సోషల్‌ మీడియాలో కనిపించి, ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె ఆఖరిసారి ఆస్పత్రి నుంచి స్కూటిపై వెళతూ కనిపించారు. ఆమె గురించి అంతకుమించి సమాచారం దొరకడం లేదు. (చదవండి: వాళ్లంతే.. చైనాలో మళ్లీ మామూలే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement